రాయ్‌బరేలీలో ఆదివారం మోదీ పర్యటన

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం పర్యటించనున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు భారతీయ జనతాపార్టీ యూపీ మీడియా కో ఇన్‌ఛార్జ్‌ నవీన్‌ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.

 పర్యటనలో భాగంగా హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన బహిరంగసభలోనూ మోదీ ప్రసంగించనున్నారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని ప్రసంగిస్తున్న మొదటి బహిరంగ సభ కావడం  గమనార్హం. ఒక విధంగా 2019 లోక్ సభ ఎన్నికలకు ప్రచార కార్యక్రమానికి ఇక్కడి నుండి ఆయన శ్రీకారం చుట్టుతున్నట్లు అవుతుంది. దానితో ఈ పర్యటన పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తి కలుగుతున్నది. 

 అక్కడి నుంచి అలహాబాద్‌ వెళ్లనున్నట్లు నవీన్‌ చెప్పారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రధాని మోదీ  అలహాబాద్‌లో సమీక్ష నిర్వహిస్తారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాయ్‌బరేలీలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం సోనియాగాంధీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే గత ఏప్రిల్‌ నుంచి సోనియా రాయ్‌బరేలీకి రాలేదు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో సోనియా ప్రచారం చేయాల్సి ఉంది. వారణాసిలో రోడ్డు షోలో పాల్గొన్న సమయంలో ఆమె అస్వస్థతకు గురవడంతో ఆ తర్వాత ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. 

దీంతో ఈ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పట్టు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇక్కడి నుండి ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చనే ప్రచారం జరుగుతున్నది.