విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు ప్రపంచ వ్యాప్త మార్కెట్

విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, పౌర విమానయాన మంత్రి సురేష్‌ప్రభు వరాల వర్షం కురిపించారు. మెడ్‌టెక్‌ జోన్‌లో పెట్టుబడి పెట్టే వారికి కావాల్సిన అవసరాలన్నీ సమకూర్చుతామని హామీ ఇచ్చారు. శుక్రవారం విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లోని కలాం కన్వెన్షన్‌ హాలులో 4వ డబ్ల్యూహెచ్‌వో వైద్యపరికరాల ప్రపంచ సదస్సులో రెండో రోజు ఆయన ప్రసంగిస్తూ వైద్యపరికరాల తయారీ, డిమాండ్‌, మార్కెటింగ్‌ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాల్ని వెల్లడించారు.

మెడ్‌టెక్‌ జోన్‌లో తయారయ్యే వైద్య ఉపకరణాలు ప్రపంచ వ్యాప్తంగా విక్రయమయ్యేలా నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని, ఇది అన్ని దేశాల వారితో సంప్రదింపులు చేస్తుందని తెలిపారు. ఏ పరికరం తయారు కావాలన్నా ముందు డిజైన్‌ ఉండాలి. వాటి రూపకల్పన కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ను మెడ్‌టెక్‌ జోన్‌ లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

వైద్యపరికరాల పరంగా, వాణిజ్య పరంగా ప్రస్తుతం పేటెంట్‌ హక్కుల్ని 81 రోజుల్లో ఇస్తున్నామని చెబుతూ దీన్ని మరింతగా తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.  దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలకు అవసరమయ్యే వైద్య పరికరాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేలా ఈ-మార్కెట్‌ను తెస్తామని, దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిద్వారా 100 మిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుందని చెప్పారు. గవర్నమెంట్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ ప్లేస్‌ పేరుతో దీన్ని అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. 

వ్యాపార సంబంధాలను పెంచేందుకు విశాఖ నుంచి డిమాండ్‌ ఉన్న దేశాలకు విమాన సర్వీసుల్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో శరీరంలోని అన్నిభాగాల్ని మార్పిడి చేసే విధానాలొస్తాయని, ఇవన్నీ అత్యాధునిక వైద్యపరికరాల ఆగమనం వల్లే సాధ్యమవుతున్నాయని సురేష్‌ప్రభు చెప్పారు. 

ఇలా ఉండగా, మెడ్‌టెక్‌ జోన్‌లో ఏర్పాటవుతున్న పరిశ్రమలు, ల్యాబొరేటరీలు చూశాక వైద్యపరికరాల తయారీ మీద తనకు ధైర్యం వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్‌ చౌబే తెలిపారు.  ప్రపంచదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. భారత్‌ తనకోసమే కాకుండా ప్రపంచం కోసం పనిచేస్తోందని చెబుతూ 2025 నాటికి టీబీ లేని దేశంగా మారుస్తామని వెల్లడించారు.