ముంపు బాధితులను పట్టించుకొని చంద్రబాబు

రాష్ట్రంలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలసిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ద్వజమెత్తారు. భారీ వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు వెంటనే నిత్యావసర సరకులతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తాడేపల్లిగూడెం పర్యటన సందర్భంగా జిల్లాలో పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయని, ఎర్ర కాలువ పొంగడంతో 20 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా జలమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేసారు.

ఇంత నష్టం జరిగినా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని, ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదని కన్నా విస్మయం వ్యక్తం చేసారు.  . కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని చెబుతూ వారికి ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర సహాయానికి కేరళ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపితే చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు శవాలపై రాజకీయాలు చేసే మనస్తత్వం కలిగిన వారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హులు కాదని తీవ్రంగా విమర్శించారు. అధికారులు సరైన సమయంలో స్పందించక పోవడంతో ఎర్ర కాలువ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు.