రాఫెల్ అసత్య ప్రచారం .. రాహుల్ క్షమాపణ చెప్పాలి

రాఫెల్ ఒప్పందంపై నరేంద్ర మోదీ ప్రభుత్వ వాదనను సమర్ధిస్తూ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు బిజెపి వర్గాలలో ఆనందం కలిగిస్తున్నది. ఈ తీర్పు మరో నెలరోజుల ముందు వచ్చిన్నట్లయితే ఐదు అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఒప్పందం  గురించి ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పలికే అవకాశం లభించి ఉండెడిది కాదని భావిస్తున్నారు. 

ఈ ఒప్పందం మొదటి నుంచి పూర్తి పారదర్శకంగా కొనసాగిందని... దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపణతో చేస్తున్నవేనని కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపైహర్షం ప్రకటించారు. 

ఈ ఒప్పందంపై అసత్య ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే ఆయన పార్లమెంటుకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

‘‘ ఈ ఒప్పందం మొదటి నుంచి పూర్తి పారదర్శకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారపూరితమైనవనీ.. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మేము చెబుతూనే ఉన్నాం...’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. రాఫెల్‌పై సుప్రీం తీర్పు అనంతరం మోదీ ప్రభుత్వంలో తొలిసారి స్పందించింది ఆయనే కావడం విశేషం.

ఈ తీర్పు కాంగ్రెస్‌, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధపు ఆరోపణలను బట్టబయలు చేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా భారత్ పరువు తీసిన రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

  రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇవాళ సత్యం గెలిచిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేశారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేశారని ధ్వజమెత్తుతూ  అబద్ధాలు చెప్పినవారికి సుప్రీం తీర్పు చెంపపెట్టని అమిత్‌షా మండిపడ్డారు. 

రాఫెల్‌ ఒప్పందంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని.. సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. అసత్య ఆరోపణలు చేసిన దేశ ప్రజలకు, సైన్యానికి రాహుల్‌ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా అమిత్‌షా డిమాండ్ చేశారు.