రాష్ట్ర మాతగా గోవు...హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం

ఆవును రాష్ట్ర మాతగా ప్రకటిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆవును రాష్ట్రమాతగా ప్రకటిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. 

పాలు ఇవ్వడం ఆగగానే ఆవులను వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు శాసనసభ్యులు కోరారు. సిర్మావూరు జిల్లాలో రూ.1.52 కోట్లతో ఆవుల కోసం ప్రత్యేకంగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేందర్ కన్వర్ చెప్పారు. సోలన్, కాంగ్రా జిల్లాల్లోనూ ఆవుల అభయారణ్యాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వీరేందర్ కన్వర్ వెల్లడించారు. గౌరి పేరిట లోకల్ ఆవుల బ్రీడ్ ను ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలు సూచించారు. 

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు రాజస్థాన్ రాష్ట్రం కూడా ఆవుల పరిరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఆవు సెస్ పేరిట రూ.8 కోట్లను వసూలు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే కిషోరిలాల్ చెప్పారు. గోవుల పరిరక్షణకు రూ.17 కోట్లు వెచ్చించామని ఎమ్మెల్యే కిషోరిలాల్ వివరించారు.