జనవరి 11, 12 ల్లో బిజెపి కార్యవర్గ సమావేశాలు

2019 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇందులోభాగంగా వచ్చేఏడాది జనవరి 11 నుంచి రెండ్రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు జరగనున్నాయి. ఈ వేదికపై నుంచే 2019 ఎన్నికలకు బీజేపీ కార్యాచరణ రూపొందించనుంది. 

రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో  అమిత్‌ షా నేతృత్వంలో 29 రాష్ట్రాలకు చెందిన ఆఫీస్‌ బేరర్ల సమావేశం గురువారం జరిగింది. జనవరిలో 11–12 తేదీల్లో పార్టీ జాతీయ కార్యనిర్వాహక మండలి సమావేలను నిర్వహించనున్నట్లు అనంతరం బిజెపి ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను పటిష్టం చేసేందుకు వేర్వేరు వర్గాలను సమీకరించఅందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువతకు బీజేపీ విధానాలు, సిద్ధాంతాలను వివరించేందుకు ఢిల్లీలో ఈ నెల 15 నుంచి రెండ్రోజుల పాటు ‘యువ మోర్చా’ సమావేశం నిర్వహిస్తారు. 

మహిళల కోసం అహ్మదాబాద్‌లో డిసెంబర్‌ 21–22 తేదీల్లో మహిళా మోర్చా సదస్సు జరుగుతుంది. షెడ్యూల్డ్‌ కులాల కోసం నాగ్‌పూర్‌లో 2019, జనవరి 19 నుంచి రెండ్రోజుల పాటు ఎస్సీ మోర్చాను నిర్వహిస్తారు. మైనారిటీల కోసం ఢిల్లీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జాతీయస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు.