టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

మంత్రిగా ఉన్న కుమారుడు తారక రామారావుకు రాజకీయ వారసత్వం కట్టబెట్టడం కోసమే తెలంగాణ ముఖ్యంత్రి చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన్నట్లు ఎన్నికల ప్రచార సభలలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దీ సేపటికే కుమారుడు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. 

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు పార్టీ పరంగా కీల‌క బాధ్య‌త‌లు అపపచెప్పారు. ఇకనుండి పార్టీ వ్యవహారాలను కుమారుడే చూసుకొంటారనే సంకేతం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా .. సీఎం కేసీఆర్ ఆయ‌నకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 

తాను ఇక జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారిస్తానని ఎన్నికలు పూర్తి కాగానే ప్రకటించిన కేసీఆర్ ఇక ప్రభుత్వంలో కూడా కుమారుడే నిర్ణయాత్మక పాత్రవహిస్తారని ఈ నియామకం ద్వారా సంకేతం ఇచ్చారు. 

తెలంగాణ ఉద్యమం పతాక స్థితిలో ఉన్న సమయంలో అమెరికాలో ఉద్యోగం వదిలి 2009 ప్రాంతంలో వచ్చి, తండ్రికి చేదోడుగా ఉంటున్న కేటీఆర్ మూడోసారి ఎమ్యెల్యేగా సిరిసిల్ల నుండి ఎన్నికయ్యారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమలు, మునిసిపల్ వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. 

తాజా ఎన్నికలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను ఆయనే చేపట్టారు. ఈ రెండు జిల్లాలో మొత్తం 29 సీట్లు ఉండగా, అధికార పక్షం 18 సీట్లను గెలుపొందింది. 2014 ఎన్నికలలో ఈ రెండు జిల్లాలో 5 సీట్లు మాత్రమే గెల్చుకోంది. 

వాస్తవానికి కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో కీలక అధికారాలను కేటీఆర్ చెలాయిస్తున్నారు. ఇప్పడు అందుకు అధికారిక ముద్ర వేసిన్నట్లు అయింది.