శాసనసభ రద్దుపై కెసిఆర్ నేడే నిర్ణయం !

శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరపాలని సన్నాహాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శాసనసభ రద్దు గురించి నేడే కీలక నిర్ణయం తీసుకోగలరని భావిస్తున్నారు. మంత్రులు అందరిని రాజధానికి చేరుకోవాలని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో కలుసుకోవాలని అందరికి కెసిఆర్ గత సాయంత్రం అత్యవసర సందేశాలు పంపడంతో ఈ భేటిలో ముందస్తు ఎన్నికలపై కీలకమైన సమాలోచనలు జరిపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇది సాధారణ మంత్రివర్గ సమావేశం కాదని, పూర్తిగా రాజకీయపరమైన అంశాలే ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల కోసం ముందుగానే సిద్ధమవుతున్నట్లు ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా ప్రకటించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ అభ్యర్ధులను సహితం 80 శాతం వరకు సెప్టెంబర్ లోనే ఖరారు చేస్తామని కుఎడ ప్రకటించారు.

నాలుగేళ్లుగా టి ఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను వివరించేందుకు వచ్చే నెల రెండో తేదీన ప్రగతి నివేదన సభను భారీ ఎత్తున  నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే వర్షాల వల్ల ఆ సభ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గ సహచరులతో సీఎం కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

డిసెంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరగుతాయని, సెప్టెంబర్ నెలాఖర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కెసిఆర్ ముందస్తు సన్నాహాలు ప్రారంభించడంతో కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు కుడా త్వరపడుతున్నాయి.

ఇప్పటికే ఎన్నికల ప్రణాళికను ఖరారు చేసిన్నట్లు కాంగ్రెస్ తెలిపింది. తమ అభ్యర్ధులను సహితం 40 నుండి 50 శాతం వరకు ముందుగానే ప్రకటిస్తామని కూడా వెల్లడించారు.