చావయినా, బతుకయినా మధ్యప్రదేశ్‌లోనే

ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన ప్రత్నమ్నాయం చూడనని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతానని ప్రకటించారు. 

‘15ఏళ్ల పాటు బిజెపి  అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు ప్రజలకు సేవ చేశాను. ఇప్పుడు నాకు పదవి లేనంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లను. అక్కడ ఎలాంటి పదవీ ఆశించను.నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే చనిపోతాను. అంతేకానీ ప్రత్యామ్నాయం చూడను. నా ఆత్మ ఇక్కడే ఉంది. నేను కూడా ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను’ అని తెలిపారు.

"స్వభావ రీత్యా నేను రాజకీయ వేత్తను కాదు. భావాత్మకంగా మధ్యప్రదేశ్ లోని 7.5 కోట్ల మంది ప్రజలతో అనుబంధం పెంచుకున్నాను. నా జీవితంలో చివరి క్షణం వరకు వారి కోసం పనిచేస్తుంటాను" అంటూ పేర్కొన్నారు. అధికారమలోకి వచ్చిన పది రోజులలో వ్యవసాయ రుణాలను రద్దు చేయడం వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలను కల్పించాలని ఆయన కోరారు. 

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో‌ ‘ఆభర్‌(కృతజ్ఞత) యాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన బిజెపికి భారీ విజయం లభించిన వింధ్య ప్రాంతం నుండి  ఈ కార్యక్రమం చేబడుతున్నారు. ఇంకా తేదీలను ప్రకటించవలసి ఉంది. ఇక్కడ 30 సీట్లు ఉండగా బీజేపీకి 24 సీట్లు గెల్చుకోంది. 2013 ఎన్నికలలో బిజెపి 16 సీట్లు మాత్రమే గెల్చుకోగా, కాంగ్రెస్ 12, బీఎస్పీ 2  సీట్లు గెల్చుకున్నారు.