కమల్‌నాథ్ కే మధ్యప్రదేశ్ పట్టం !

సుదీర్ఘ కసరత్తు అనంతరం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. గురువారం ఉదయం నుండి రాహుల్ గాంధీ నివాసం కేంద్రంగా జరిగిన భారీ కసరత్తు అనంతరం రాత్రి పొద్దు పోయిన తర్వాత భోపాల్ లో జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. 

యువనేత జ్యోతిరాదిత్య సింధియా  సహితం ఈ పదవికి తీవ్రంగా పోటీ పడినా యుపిఎ చైర్ పర్సన్  సోనియా గాంధీ తొమ్మిదిసార్లు లోక్ సభకు ఎన్నికైన  కమల్‌నాథ్ అనుభవానికి మద్దతుగా `వీటో' ప్రయోగించడంతో ఆయనవైపు మొగ్గు చూపక రాహుల్ కు తప్పలేదని చెబుతున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వర్గాలతో ఆయనకున్న పలుకుబడి కారణంగా 2019 ఎన్నికలలో భారీ ప్రచార వ్యయాన్ని సమకూరుస్తారనే అంచనాతోనే ఆయనను ఎంపిక చేసిన్నట్లు తెలుస్తున్నది. 

పైగా కాంగ్రెస్ కు బొటాబొటిగా మాత్రమే ఆధిక్యత ఉండటం, కాంగ్రెస్ కు దాదాపు సమానంగా బిజెపికి కూడా బలం ఉండడంతో 2019 ఎన్నికలను ఎదుర్కోవడం సింధియా నాయకత్వంలో సాహసం కాగలదని భావించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై రాజీ పడడనైకి సింధియా కూడా సిద్దపడడంతో నాయకత్వ ఎంపిక సునాయానంగా ముగిసింది. 

కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న కమల్‌నాథ్ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు, విశ్వసనీయుడన్న పేరు తెచ్చుకున్నారు.    అత్యవసర పరిస్థితి ప్రభావంతో ఓటమి చెందిన ఇందిరా గాంధీ తిరిగి 1980లో పుంజుకోవడం కోసం ఎన్నికలలో నిలబెట్టి ప్రోత్సహించిన యువ నేతలలో ఆయన ఒక్కరు. అప్పటి నుండి కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

 వివాదాలకు దూరంగా ఉండటం ఆయన నైజం. ఆయన దృష్టి ఎప్పుడూ అధిష్ఠానం అప్పజెప్పిన పనిని అత్యంత వేగంగా, సమర్థంగా, చాకచక్యంగా పూర్తి చేయడంపైనే ఉంటుంది. హడావుడి, ఆర్భాటం లేకుండా పని చేయడం ఇష్టం. ఈ లక్షణాలే ఆయనను అధిష్ఠానానికి సన్నిహితుడిని చేశాయి. ఇందిర, రాజీవ్‌, సోనియాలతో సన్నిహితంగా పనిచేసిన ఆయనకు ఆ కుటుంబంలో నాలుగో తరానికి చెందిన ప్రస్తుత పార్టీ అధినేత రాహుల్‌గాంధీతోనూ సత్సంబంధాలున్నాయి. ఈ సంబంధాలే ఆయనను దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌ పార్టీ అధ్యక్షుడిని, ఇప్పుడు సీఎం పీఠం ఎక్కేలా చేశాయి.

అయితే రాజస్థాన్‌లో మాత్రం సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్‌ల మధ్య పంచాయితీ ఒక కొలిక్కిరాలేదు. గెహ్లాట్ వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నా.. సచిన్ పైలట్ రాజీకి సిద్ధపడేలా కనిపించడం లేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పినా.. ఆయన ససేమిరా అంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో సీఎం అభ్యర్థి ఎంపికను రాహుల్ శుక్రవారానికి వాయిదా వేశారు. 

కాగా పైలట్‌కు మద్దతుగా ఆయన అనుచరులు రాహుల్ నివాసం వద్ద గురువారం ఉదయం నినాదాలు చేశారు. రాజస్థాన్‌లోని దౌసా, అజ్మీర్, కరౌలి ప్రాంతాల్లోనూ పైలట్ సామాజికవర్గానికి చెందిన గుజ్జ్జర్లు రాస్తారోకోలు చేపట్టారు. చర్చలు అర్ధంతరంగా ముగియడంతో ఆశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ జైపూర్‌కు తిరిగివచ్చారు. దానితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

మరోవైపు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను కూడా రాహుల్ శుక్రవారం చేపట్టనున్నారు. ఆ రాష్ట్రంలో సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న నలుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే ఒక దఫా చర్చలు పూర్తిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బాఘెల్(57), సీఎల్పీ మాజీ నేత టీఎస్ సింగ్‌దేవ్(66), ఓబీసీ నాయకుడు తమరధ్వజ్ సాహూ(69), కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్‌దాస్ మహంత్(64).. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. శుక్రవారం రాహుల్ వీరితో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.  

ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక కొలిక్కి రాకపోతు ఉండడంతో కాంగ్రెస్ నేతలలో అసహనం వ్యక్తం అవుతున్నది. మరోవంక ఎన్నికలలో గెలుపొందిన ఉత్సాహం నీరు గారుతున్నది.