ఆన్‌లైన్‌లో ఔషధ అమ్మకాలపై నిషేధం

ఆన్‌లైన్‌ ద్వారా ఔషధాలు అమ్మే విధానాన్ని నిషేధించాలని దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిబంధన తక్షణం దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ ప్రభుత్వం సహా కేంద్రానికి ధర్మాసనం సూచించింది.

 దిల్లీకి చెందిన ఓ చర్మ వ్యాధి నిపుణుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మేనన్‌‌, జస్టిస్‌ వీకే రావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం-1940, ఫార్మసీ చట్టం-1948 ప్రకారం ఔషధాలను ఆన్‌లైన్‌ వేదికల్లో అమ్మేందుకు అనుమతి లేదని చర్మవ్యాధి నిపుణుడు పిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షల సంఖ్యలో మందులు ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా అమ్ముడవుతున్నందున, పొరపాటున ఔషధ మార్పిడి జరిగితే రోగులతో పాటు వైద్యులకు సైతం ప్రమాదం పొంచి ఉంటుందని వివరించారు. 

‘‘ఔషధాలు సాధారణ వస్తువుల మాదిరి కాదు. అవగాహన లోపం వల్ల వీటిని సక్రమంగా చేరవేయడం, వాడడం వంటివి చేయకపోతే వ్యక్తుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.’’ అని వివరించారు.

గత సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 328 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ డ్రగ్స్‌ (ఎఫ్‌డీసీ) తయారీని, అమ్మకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిషేధించిన సంగతి తెలిసిందే.