యడ్యూరప్ప త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి !

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఊహించని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతల్లో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణం కూలిపోవడమా తధ్యం అనే భరోసా కనిపిస్తున్నది. బీజేపీ అధిష్ఠానం ఈ అంశంపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా  రాష్ట్రంలోని బిజెపి నేతలు మాత్రం ప్రభుత్వం మార్పు తధ్యం అనే ధీమాలో కనిపిస్తున్నారు. 

తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌.అశోక్‌ యడ్యూరప్ప త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నది. " మీరే చూస్తుండండి.. ఏం జరుగుతుందో.." అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల ఫలితాలకు కర్ణాటకలో ప్రభుత్వ మార్పుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో వర్షం పడితే కర్ణాటకలో కూడా కురవాలని రూల్‌ ఏమైనా ఉందా.. అని ఆయన ఎదురుప్రశ్న వేశారు. యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ నాయకత్వంలో మహాకూటమి పొరుగుననే ఉన్న  తెలంగాణలో చిత్తుగా ఓడిందని గుర్తు చేశారు.  కర్ణాటకలోనూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ మహాకూటమికి ఇదే గతి పట్టనుందని ఆయన జోస్యం చెప్పారు.  మూడు రాష్ట్రాల గెలుపుతో కాంగ్రెస్‌ నేతలు విర్రవీగాల్సిన అవసరం లేదని హితవు చెప్పారు. మోదీ ప్రతిష్ట ఏమాత్రం మసకబారలేదని స్పష్టం చేశారు.