ప్రజారోగ్యంపై వ్యయాన్ని 2.5 శాతంకు పెంచుతాం

ప్రజారోగ్యంపై కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయాన్ని 2025 నాటికి దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 2.5 శాతానికి పెంచుతామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.  ఢిల్లీలో జరిగిన 2018 భాగస్వామ్య వేదిక సదస్సును ప్రారంభిస్తూ  వైద్య ఖర్చులకు పేదల జేబులు గుళ్ల అవుతుండడాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం వారి కోసం ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీన్ని ద్విముఖ వ్యూహంతో అమలు చేస్తున్నామని చెప్పారు. 

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని, 5 కోట్ల మంది పేద ప్రజలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మరోవైపు 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయనున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం ప్రజారోగ్యంపై జీడీపీలో 1.15 శాతం వెచ్చిస్తుండగా, 2025 నాటికి దాన్ని 2.5 శాతానికి పెంచుతామని ఆయన వెల్లడించారు. మహిళలు, చిన్నారులు, యువతను దృష్టిలో ఉంచుకునే తాము ప్రతి పథకాన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంతో పాటు వివిధ దేశాల్లో అమలవుతున్న 11 పథకాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో మిషన్ ఇంద్రధనుష్ ద్వారా దేశంలో 3.28 కోట్ల మంది చిన్నారులకు, 84 లక్షల మంది గర్బిణులకు వ్యాక్సిన్లు అందజేసినట్లు మోదీ వెల్లడించారు. 

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. వైద్య రంగంలో అమలవుతున్న ఉత్తమ పథకాలు, విధానాల గురించి పరస్పరం తెలుసుకోవడం ద్వారా ఈ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.