శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం నేతగా కె చంద్రశేఖరరావు తిరిగి ఎన్నికయ్యారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ తరఫున గెలుపొందిన 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

గురువారం మధ్యాహ్నం 1.30కు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా మరికొంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

 కాగా, టీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడిగా తనను ఎన్నుకున్నందుకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని తెలిపారు. కుదిరితే రేపు ఇద్దరం ప్రమాణస్వీకారం చేస్తాం. ఐదారు రోజుల్లో మిగతా వాళ్లు ప్రమాణస్వీకారం చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. 

 నలుగురు మంత్రులు ఓడిపోయినందున, వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

 కొత్తగా కొలువుదీరే శాసనసభలో తానే సీనియర్ ఎమ్మెల్యేనని కేసీఆర్ చెప్పారు. తన తర్వాత రెడ్యా నాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సీనియర్లు అని తెలిపారు. లెక్క ప్రకారం 95 నుంచి 106 సీట్లు తాము గెలవాల్సి ఉంది. 

ఖమ్మంలో తమ పార్టీ అంతర్గత విబేధాల వల్లే ఓడిపోయామని పేర్కొన్నారు. గెలిచిన వాళ్లే కాదు.. గెలవని వాళ్లు కూడా తనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. గెలవని వాళ్లను కూడా కలవాలి.. వాళ్లతో మాట్లాడాలి అని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.