టిడిపి ఎమ్యెల్యేకు సుప్రీంలోనూ ఎదురుదెబ్బ

అనంతపురం జిల్లా మడకశిర టిడిపి  ఎమ్మెల్యే కె.ఈరన్నకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఈరన్న దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టంచేసింది.

మడకశిర ఎమ్మెల్యేగా ఈరన్న ఎన్నికను సవాలు చేస్తూ 2014 ఏప్రిల్‌లో వైసిపి నుంచి బరిలోకి దిగి పరాజయంపాలైన తిప్పేస్వామి.. అదే ఏడాది జూన్‌లో ఎన్నికల ట్రైబ్యునల్‌/ హైకోర్టులో ఈపీ దాఖలు చేశారు. ఈరన్న ఎన్నికను చెల్లుబాటుకానిదిగా పేర్కొంటూ తనను ఆ నియోజకవర్గానికి ఎన్నికైనట్లు ప్రకటించాలని అభ్యర్థించారు. 

ఆయన తన అఫిడవిట్‌లో భార్య ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయాన్ని, కేసు నమోదు వివరాల్ని పేర్కొనలేదని తెలిపారు.  ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి తనపై నమోదైన కేసుల వివరాల్ని స్వచ్ఛందంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో తిప్పేస్వామి వాదనలు విన్న హైకోర్టు.. ఈరన్నను అనర్హుడిగా ప్రకటించింది. తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టంచేసింది.