జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పాత్రపై నీలినీడలు !

 

తెలంగాణ ఎన్నికల్లో చావు దెబ్బ తినడంతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏమిటనే విషయమై ఆ పార్టీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో కూటమి గెలుపుపై గంపెడాశలు పెంచుకున్న పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్ ఘన విజయంతో తీవ్ర నైరాశ్యంకు గురయ్యారు. మరోవంక కాంగ్రెస్ నేతలలో కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం, ఆయన వచ్చి విస్తృతంగా ప్రచారం చేయడంతోనే తమకు ఘోర పరాజయం ఎదురైనది వాపోతున్నారు. 

 తెలంగాణ ఫలితాలు ఆంధ్రపై తగు ప్రభావం చూపగలవాని కూడా టిడిపి వర్గాలలో ఆందోళన కలుగుతున్నది. ఎన్డీఏ నుంచి వైదొలగిన అనంతరం ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసి బీజేపీ వ్యతిరేక పవనాలు వీచేలా చేయటంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతకృత్యులైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా మారిన తెలంగాణ ఎన్నికల్లో పరాజయం ఒకింత కుంగదీస్తోంది. మరోవంక ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల శాతాన్ని పెంచుకోలేక పోతున్నారు. దానితో ప్రతిపక్షాలలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. 

ఫలితాలకు కొద్దిగంటల ముందే జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల నేతలతో బీజేపీ యేతర ప్రత్యామ్నాయంపై ఐక్యఫ్రంట్ తొలి సమావేశం నిర్వహించిన సంగతి విదితమే.  ఈ సమావేశం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గతంలో వల్లే ఏర్పర్చబోయే కూటమి కన్వీనర్ బాధ్యతలు తనకే అప్పచెబుతారని ఎదురు చూసారు. కానీ అటువంటి ప్రస్తావనను ఎవ్వరు చేయక పోవడంతో కొంత నిరుత్సాహం చెందిన్నట్లు తెలుస్తున్నది. 

కూటమి ఏర్పాటు గురించి ఆ సమావేశంలో ఎటువంటి సమాలోచనలు జరుగక పోయినా ఒక కన్వీనర్ ను ఏర్పాటు చేయాలనీ శరద్ యాదవ్ సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెల్లాట్ పేరును సూచించడంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. అయితే రాజస్థాన్ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం ఆయన సేవలను కూటమిఁ కోసం వినియోగించుకోలేమని అంటూ రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. కానీ రాహుల్ సహితం చంద్రబాబు పేరును సూచించక పోవడం గమనార్హం.

గతంలో యునైటెడ్ ఫ్రంట్ సమయంలో వలే కన్వీనర్ పదవి చంద్రబాబుకు లభించే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓటమి వైపు ప్రయాణం చేస్తున్న చంద్రబాబును ఒక `మెస్సెంజర్' వలే ఉపయోగించుకోవడం, నిధులు సమకూర్చే నిధిగా వాడుకోవడం మినహా ఆయనకు నాయకత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేరని స్పష్టం అవుతున్నది. తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న మద్దతు పట్ల కాంగ్రెస్ ఆశలు సన్నగిల్లిన్నట్లు చెబుతున్నారు. 

ఈ  ఫలితాల అనంతరం జాతీయ ఫ్రంట్ ఏర్పాటులో సమీకరణలు మారతాయనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ లేదా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలే చక్రం తిప్పుతున్నాయని, తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. 

బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా లేని కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని కేసీఆర్ ప్రకటించడంతో పలు ప్రాంతీయ పార్టీలు ఆయన నాయకత్వం వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  ఆంధ్ర ప్రదేశ్ లో  వైఎస్సార్ కాంగ్రెస్‌కు కేసీఆర్ మద్దతిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ గెలుపొందగానే జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలపడం తెలిసిందే. 

 తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో సైతం ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ తరహాలో ఒంటరిగా పోటీచేసి గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా విజయం సాధించగలమనే ధీమా టిడిపి వర్గాలలో కనిపించడం లేదు. ఎప్పుడు ఒంటరిగా పార్టీని విజయం వైపు నడిపించిన చరిత్ర కూడా చంద్రబాబుకు లేకపోవడమా తెలిసిందే.