ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకోలేక పోయిన కాంగ్రెస్

ఐదు రాష్ట్రాల  ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓట్లుగా మార్చుకోలేక పోయింది. ఛత్తీస్‌గఢ్ మినహా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దీ విఫల ప్రదర్శన అనే తెలుస్తున్నది. బీజేపీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకతను ప్రధాన విపక్షం కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోయినట్లు తెలుస్తున్నది. 

ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక కనిపిస్తున్నది. మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు అధికారంలో ఉంటూ వచ్చిన బీజేపీపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉత్పన్నమవ్వాలి. కానీ, దానిని ఒడిసిపట్టుకోవడంలోగానీ, ప్రజల్లో అధికారపక్షంపై వ్యతిరేకతను రగల్చడంలో కానీ కాంగ్రెస్ పూర్తిగా సఫలీకృతం కాలేదు. ఫలితంగా 15ఏండ్లుగా అధికారంలో ఉంటున్న బీజేపీని ఢీ కొట్టి భారీ మెజార్టీతో వెనక్కి నెట్టాల్సిన కాంగ్రెస్.. చివరకు నువ్వానేనా అనే స్థాయిలో పోరాడాల్సి వస్తున్నది.

బుధవారం ఉదయం 5.30 గంటల సమయానికి రెండు పార్టీలు దాదాపు సమానంగా 41 శాతం ఓట్లు వచ్చాయి. బిజెపి కన్నా కాంగ్రెస్ కు కేవలం 36,422 ఓట్ల ఆధిక్యత మాత్రమే ఉన్నది. సీట్ల విషయంలో కూడా దోబూచులాట కనిపిస్తున్నది. 

గతంలో ప్రతిసారి ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. 2013లో బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి మాత్రం.. అస్పష్ట రాజకీయ చిత్రమే కనిపిస్తున్నది. తుది ఫలితాల్లోనూ ఇలాగే ఉంటే.. ప్రభుత్వ ఏర్పాటులో ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పాత్ర కీలకం కానున్నది. బీఎస్పీ, ఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రుల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. దానితో ఏర్పడబోయే ప్రభుత్వ సుస్థిరత పట్ల అనుమానాలు వెల్లడి అవుతున్నాయి. 

రాజస్థాన్‌లోనూ వసుంధరరాజె ప్రభుత్వంపై భారీ విజయాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందని ఊహాగానాలు వెలువడినా. వాస్తవ ఫలితాలు అంత భారీగా ఏమీ కనిపించలేదు. 199 స్థానాల పెద్ద రాష్ట్రంలో 20నుంచి 30 వరకు మాత్రమే బీజేపీ కన్నా కాంగ్రెస్ అధికంగా గెలిచింది. సొంతం గా భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన కాంగ్రెస్.. చివరకు స్వతంత్రులు, ఇతర పార్టీల విజేతల సహకారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఫలితాల వెల్లడి తర్వాత స్వతంత్ర, చిన్నపార్టీల విజేతలకు పిలుపునివ్వడం గమనార్హం. 2003 నుంచి రమణ్‌సింగ్ పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు మళ్లించుకోవడంలో పీసీసీ సారథి భూపేశ్ బాగెల్ విజయం సాధించారు.మిజోరంలో కాంగ్రెస్ ఏకంగా అధికారాన్ని కోల్పోయింది.