తెలుగు ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటూ తమకు లక్ష కంటే ఎక్కువగా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయని వెల్లడించారు.
దేశ రాజకీయాలను బాగుచేసుకొనే క్రమంలో తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే తప్పకుండా తాము ఏపీలో కూడా అడుగు పెడతామని ప్రకటించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని, అలాంటిది తాను అక్కడికి వెళ్లి పనిచేయొద్దా? అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు మరొకటి తిరిగి ఇవ్వాలి కదా.. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అంటారని చురకలంటించారు. తాను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నికు బదులిచ్చారు.
కేసీఆర్ ఎవరివైపు ఉంటారో చెప్పాలని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు. తాను ఎవరివైపు ఉన్నానో అడగడానికి అసలు చంద్రబాబు ఎవరు? అని మండిపడ్డారు. ఏపీలో ఆయన పరిస్థితే చక్కగా లేదని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారని, అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబుతో పాటు తానూ ఉన్నానని.. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడారో, ఆయన పరువు ఎలా పోయిందో అంతా తనకు తెలుసన్నారు.
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి తెలంగాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు.. కులాలు, మతాలకతీతంగా నిండుగా దీవించి తమకు ఈ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. తమకు ఈ గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు యావత్ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తామన్నారు.