ఛత్తీస్‌గఢ్‌ లో తలకిందులైన బీజేపీ అంచనాలు

అందరి అంచనాలు,    ఎగ్జిట్‌ పోల్స్‌  ను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు తీర్పు ఇచ్చారు.  గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించి ఛత్తీస్‌గఢ్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ హస్తగతం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురులేని పార్టీగా ఉన్న కమలదళానికి కాంగ్రెస్ గట్టి షాక్‌ ఇచ్చింది. 65  సీట్లతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్దపడుతూ ఉండగా, బీజేపీకి 16 సీట్లతో సర్దుకో  వలసి వచ్చింది. బీఎస్పీ కూటమి 8   సీట్లను గెల్చుకోంది. 

గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఛత్తీస్‌గఢ్‌లో 15ఏళ్లుగా \బీజేపీ  అధికారంలో ఉంది. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ బిజెపినే గెలుస్తుందని సర్వేలు అంచనా వేశాయి. ఆ అంచనాలను తిప్పికొడుతూ హస్తం పార్టీ జయభేరీ మోగించింది.

మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయి ఆవిర్భవించిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. బీజేపీ నేత, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఒకవైపు.. కాంగ్రెస్‌ మరోవైపు ఉండగా, ఇతర పక్షాలు ఇతోధికంగా ఓట్లను చీల్చుతున్నాయి. గత మూడు దఫాలూ ఇదే జరిగి రమణ్‌సింగ్‌ విజయకేతనం ఎగురవేశారు. 

 కాంగ్రెస్‌లో బలమైన వర్గం ఉన్న అజిత్‌ జోగి పార్టీ వీడి సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేశారు. దీంతో ఈ పరిణామం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా భావిస్తుందని అంతా భావించారు. అయితే తాజా ఎన్నికల్లో జోగి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం.

రాష్ట్రం ఏర్పడ్డాక జోగి కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత ఆయన విపరీత పోకడలతో కాంగ్రెస్‌ అధికారానికి దూరమయ్యింది. ఇప్పుడు ఆయన ఏకంగా వేరుకుంపటి పెట్టారు. 

అజిత్‌ జోగి-మాయావతి (జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌- బీఎస్పీ) కూటమి రూపంలో కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బతీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యంగా ఈ కూటమి బిజెపికే నష్టం చేకూర్చించింది. జోగిపై అవినీతి ఆరోపణలు, ఆయన పార్టీకి సరైన సంస్థాగతమైన నిర్మాణం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఆయన వెనుకబడిపోయారు.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్‌సింగ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం బిజెపికి సానుకూలాంశమే. అయితే పైగా, మహిళలు, యువతకు స్మార్ట్‌ఫోన్లు అందించేందుకు ఉద్దేశించిన ఛత్తీస్‌గఢ్‌ సంచార్‌ క్రాంతి యోజన, ఉపాధి హామీ కూలీల కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి అల్పాహార వితరణ, సహజ్‌ బిజ్లీ బిల్‌ పథకాలు తీసుకొచ్చినా అవి బిజెపిని నెగ్గించలేకపోయాయి. మరోవైపు ఇదే అంశాన్ని కాంగ్రెస్ తమ ప్రచారాంశంగా మలుచుకుంది.  అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తామంటూ హామీల వర్షం కురిపించడం ఆ  పార్టీకి కొంతమేర ప్రయోజనం కలిగించినట్లు కనిపిస్తున్నది. 

కాగా.. మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఛత్తీసగఢ్‌లోనూ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. దీంతో కొత్త సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో సీనియర్‌ నేత భూపేశ్‌ భగేల్‌ పేరు వినిపిస్తోంది. భూపేశ్‌ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోక ముందు 1993, 1998లో మధ్యప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు.

 ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఆవిర్భావమయ్యాక 2004లో దుర్గ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌పూర్‌ నుంచి విజయం సాధించారు. 2013లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పటాన్‌ స్థానం నుంచి గెలుపొందారు. 2014 నుంచి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.