మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌కు పట్టం

ఈశాన్య భారతంలో తమ చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రమైన మిజోరంను కూడా కాంగ్రెస్‌ కోల్పోయింది. దీంతో ఇక్కడ పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకు తెరపడింది. ప్రతిపక్ష మిజో నేషనల్‌ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్‌)‌ స్పష్టమైన మెజార్టీతో విజయం దిశగా దూసుకుపోతోంది. మొదటి సారిగా బిజెపి మిజోరాం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది. ఎంఎన్ఎఫ్‌ విడిగా పోటీ చేసినా ఎన్డీయే భాగస్వామి పక్షం కావడం గమనార్హం. ఈశాన్య భారతంలో కాంగ్రెస్ అధికారమలో ఉన్న చివరి రాష్ట్రం కూడా ఆ పార్టీ చేతి నుండి జారిపోయింది. 

ఇక్కడ ప్రతి రెండు దఫాల తర్వాత అధికారం చేతులు మారుతూ వస్తోంది. 1987లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ల మధ్య అధికార మార్పిడి జరిగింది. ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా కాంగ్రెస్‌ చేతిలో నుంచి ఎంఎన్ఎఫ్‌ అధికారం చేజిక్కించుకోబోతోంది. దీంతో ఎంఎన్ఎఫ్‌ అధినేత జోరంతాంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. 

పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ నేత లాల్‌తన్హావ్లా ప్రభావంతో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందేమోనని అంచనాలు వచ్చాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తేలిపోయింది.

2016 నుంచి ఈశాన్య భారతంలోని అసోం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బిజెపి, దాని మిత్ర పక్షాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు మిగిలిపోయిన ఏకైక రాష్ట్రం కూడా కాంగ్రెస్‌ చేతిలో నుంచి వెళ్లిపోయింది. 

తాజా ఎన్నికల్లో మిజోరంలో ఎంఎన్ఎఫ్‌ విజయం  సాధించింది. 40 స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్‌ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 6 నియోజకవర్గాల్లో,  బిజెపి ఒక నియోజకవర్గంలో, ఇతరులు ఆరు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 34చోట్ల, ఎంఎఎన్ఎఫ్‌ 5 స్థానాల్లో గెలుపొందాయి. ఈసారి ఫలితాలు తారుమారు అవుతున్నాయి.

ఎన్నికలకు ముందు మిజోరం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు చొప్పున స్పీకర్‌ సహా ఐదుగురు శాసనసభ్యులు పార్టీని వీడారు. ఈ ప్రభావం కాంగ్రెస్‌పై తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి బ్రూ గిరిజన తెగ సమస్య రాష్ట్రాన్ని కుదిపేసింది. మిగతా పార్టీలన్నీ రాష్ట్రంలోని సమస్యలను ప్రధాన అజెండాగా మార్చుకోవడంతో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ పడింది. 

మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చింది. అటు ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు ఎంఎన్ఎఫ్‌ హామీల నేపథ్యంలో మిజోరం ఓటర్లు ఎంఎన్‌ఎఫ్‌కే పట్టం కట్టారు.  

ఇలా ఉండగా, మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత లాల్‌ తన్హావ్లా ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు చాంపై సౌత్‌, సెర్చిఫ్‌ల నుంచి పోటీ చేసిన లాల్‌ తన్హావ్లా రెండు చోట్ల పరాజయం పాలు కావడం గమనార్హం.