సత్యపాల్ మాలిక్‌కు కశ్మీర్ పగ్గాలు

గవర్నర్ పాలనలో ఉన్నజమ్మూకశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు సత్యపాల్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఆయన ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. తాజాగా ఆయనను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా నియమించినట్టు కేంద్ర ప్రకటించింది. ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

సత్యపాల్ మాలిక్‌తో పాటు ఏడు రాష్ట్రాల కొత్త గవర్నర్లను కూడా కేంద్ర ఇవాళ నియమించింది. బీహార్‌ గవర్నగా వాజ్‌పేయి సన్నిహితుడుగా పేరున్న లాల్జీ టాండన్ నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉండగా, నరేంద్ర నాథ్ వోహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ (71) త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

అట్లాగే హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్యలను నీయమించారు. మేఘాలయ గవర్నర్ గంగ ప్రసాద్ ను సిక్కిం గవర్నర్ గా, తరచూ వివాదాస్పద వాఖ్యలు చేస్తున్న త్రిపుర గవర్నర్ తదాగత రాయ్ ని మేఘాలయ గవర్నర్గా, హర్యానా గవర్నర్ కస్తాన్ సింగ్ సోలంకి ని త్రిపుర గవర్నర్ గా నీయమించారు.