చంద్రబాబుకు మాయావతి, అఖిలేష్ షాక్ !

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి, బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయడం కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాగం చేసి ఢిల్లీలో సోమవారం జరిపిన సమావేశానికి రెండు కీలక పక్షాల నేతలు హాజరు కాకపోవడంతో ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టాయి పైగా ఈ సమావేశంలో కూటమి ఏర్పాటు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కువగా పార్లమెంట్ సమావేశాలలో ఉమ్మడిగా మోదీ ప్రభుత్వంపై దాడి చేయడం కోసమే సమాలోచనలు జరిపారు. 

అందులో భాగంగానే మంగళవారం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను కలవాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో చేరడం పట్ల ఆసక్తిగా లేని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశానికి హాజరైనా కూటమి ఏర్పాటు పట్ల అంతగా ఆసక్తి కనబరచిన్నట్లు లేదు.  త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాతే జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేయాలని 21 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. 

ఉత్తర ప్రదేశ్ లో బలమైన నేతలుగా పేరున్న అఖిలేశ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, మయావతిలు డుమ్మా కొట్టడంతో కూటమి ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది. పైగా తనవల్లే విపక్షాలు ఏకమవుతన్నాయని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఏపాటి స్థానం ఉందో ఈ సంఘటనతో తెటతెల్లమయింది. చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి పిలిచినా కూడా మయావతి, అఖిలేశ్‌లు ఆయన విజ్ఞప్తికి స్పందించక పోవడం గమనార్హం. 

కాంగ్రెస్ తో చేతులు కలిపితే తనతో ఉన్న దళితులు జారిపోతారని మాయావతి భావిస్తున్నారు. పైగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి చోట్ల కొత్తగా యువ దళిత్ నేతలను రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తూ ఉండటం పట్ల ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి గౌరవనీయ సంఖ్యలో సీట్లు కేటాయించడం పట్ల రాహుల్ ఆసక్తి కనబరచి లేదు. దానితో ఆమె కాంగ్రస్ తో సంబంధం లేకుండా అభ్యర్థులను నిలబెట్టారు. 

అఖిలేష్ యాదవ్ కు సహితం ఉత్తర ప్రదేశ్ లో మాయావతితో పొత్తు ముఖ్యంగాని కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కాకపోవడంతో ఆమె కారణంగానే ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తున్నది. 

మోదీని ఎదుర్కొవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో విపక్షాల సాధించే స్థానాలు కీలకం కానున్నాయి. కానీ అక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న బీఎస్పీ, ఎస్పీలు నేడు జరిగిన సమావేశానికి దూరంగా జరగడంతో.. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.