‘అటల్‌ నగర్‌’గా నయా రాయ్‌పూర్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రాజధాని నయా రాయ్‌పూర్‌ ప్రాంతానికి ‘అటల్‌ నగర్‌’ అని పేరు పెట్టాలని ఆ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అద్యక్షతన జరిగిన  ఆ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి నివాళిగా పలు నిర్ణయాలు తీసుకుంది.

నయా రాయ్‌పూర్‌కి అటల్‌ నగర్‌, బిలాస్‌పూర్‌ విశ్వవిద్యాలయానికి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ యూనివర్సిటీగా పేర్లు పెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, నయా రాయ్‌పూర్‌లోని కలెక్టరేట్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న జాతీయ పార్కుకి అటల్‌ పార్కు అని, రాజ్‌నందగావ్‌ వైద్య కళాశాలకు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కళాశాల అని పేర్లు పెడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

తమ రాష్ట్రంలోని ఓ పోలీస్‌ బెటాలియన్‌కి ‘పోఖ్రాన్‌ బెటాలియన్‌ అని పేరు పెడతామని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో వాజ్‌పేయీ హయాంలో జరిపిన న్యూక్లియర్‌ పరీక్షకు గుర్తుగా తమ రాష్ట్రంలోని ఓ పోలీస్‌ బెటాలియన్‌కు ఈ పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో 25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తోన్న ఎయిమ్స్‌ ఆడిటోరియానికి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేయనున్నారు. జాతీయ ప్రజా పనుల శాఖ (సీపీడబ్లూడీ) నిర్మిస్తోన్న ఈ ఆడిటోరియంలో 750 సీట్లు ఉంటాయని, ఇందులో అధునాతన సౌకర్యాలు ఉంటాయని ఎయిమ్స్‌ సంచాలకుడు రవి కాంత్‌  చెప్పారు. ఈ ఆడిటోరియ నిర్మాణం వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతుందని తెలిపారు.