ఏపీలో కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వం

ఏపీలో కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వబోమని మహిళామోర్చ జాతీయ నేత పురంధేశ్వరి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై చంద్రబాబు ఏం చెప్తారని ఆమె ప్రశ్నించారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌ న్యాయమైనదేనని అన్నారు చెప్పారు.  

అనంతపురం జిల్లా పెనుకొండలోని వాల్మీకులను ఎస్టీలలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రధయాత్ర ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర నిధులతోనే పోలవరం పనులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.  

పోలవరం ప్రాజేక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయా? అని పురంధరేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు మూడువేల కోట్లు రావాలని, కేంద్రం ఇవ్వలేదని ఆరోపించడం సరికాదన్నారు. కొంత జాప్యం జరగవచ్చు కానీ.. నిధులు ఇస్తున్నారు కదా అని ఆమె స్పష్టం చేశారు. 

ఎన్నికలకు భయపడుతున్న టిడిపి 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ భయపడుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఏపీలో 175 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. 2019లో ఏపీలో టీడీపీకి గడ్డుకాలమేనని అన్నారు. 

మోదీపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని కన్నా విమర్శించారు. ప్రజలు తెలివైనవారని, అన్నీ గమనిస్తున్నారని ఆయన చెప్పారు. నరేంద్ర మోది నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, తల్లి, పిల్ల కాంగ్రేస్‌కు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కన్నా పేర్కొన్నారు.