ఇక ఏపీపై బిజెపి ద్రుష్టి.. బస్ యాత్రతో ప్రారంభం !

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో బీజేపీ అగ్రనాయకత్వం ఇక ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారిస్తోంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యూహరచన సాగిస్తూ, పలువురు జాతీయ నాయకులను ఏకతాటిపైకి తీసుకువస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కడుపు తున్న దృష్ట్యా టిడిపిని కట్టడి చేయడంతో పాటు, రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వంలో కీలక భాగస్వామి వహించే విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు. 

కేవలం తన ప్రభుత్వ వైఫల్యాలు, తన మంత్రులు - కుటుంభం సభ్యులు, సన్నిహితులపై వస్తున్న తీవ్ర అవినీతి ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే చంద్రబాబు నాయుడు బీజేపపిని, ప్రధాని మోదీని ఒక `బూచి'గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, జాతీయ స్థాయిలో తానేదో కీలక పాత్ర వహించబోతున్నట్లు ఇక్కడ ప్రచారం కల్పించడం ద్వారా ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి నాయకత్వం భావిస్తున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేరుగా కలసి వేదికలు పంచుకోవడానికి సహితం పలు పార్టీల నేతలు సిద్ధంగా లేని సమయంలో రాహుల్ ప్రతినిధిగా వ్యవహరిస్తూ తానేదో `అద్భుతం' సృష్టించబోతున్నట్లు స్థానిక మీడియా ద్వారా ప్రచారం చేయించు కోవడం తెలిసిందే. 

అందుకనే చంద్రబాబు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంతో పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజల వద్దకు తీసుకు వెళ్లడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా అటు టిడిపికి, ఇటు జగన్, పవన్ కళ్యాణ్ లకు దూరంగా ఉన్న ప్రాగళ్యం గల వివిధ వర్గాలను, నేతలను దగ్గర చేర్చుకొని కృషి కుకూడా చేస్తున్నారు. త్రిపురలో అనూహ్యంగా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన సునీల్‌ దియోధర్‌ రాష్ట్రంలోనే మకాం వేసి ఈ మొత్తం వ్యూహరచనను అమలు చేస్తున్నారు. 

డిసెంబర్ 1 నుండి 10 వరకు జరిపిన `ఇంటింటికి బిజెపి' కార్యక్రమంలో ప్రతి రాష్ట్రస్థాయి నాయకులు అందరు కదిలారు. ఇప్పుడు జనవరిలో శ్రీకాకుళం నుండి బస్సు యాత్రను ప్రారంభించి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కూడా పర్యటనలు చేయనున్నారు. ఇదొక్క విధంగా 2019 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంగా బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ యాత్ర వివిధ దశలలో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లతో పాటు పలువురు కేంద్ర నాయకులు, యోగి ఆడియనాథ్ పాల్గొనే అవకాశం ఉంది. 

ఇందుకోసం ప్రత్యేక బస్సును 20 సీట్లతో ఆధునిక వసతులతో సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు మినహా మిగిలిన రోజుల్లో బస్సు యాత్రను నిర్వహించాలన్న ఆలోచనలో బిజెపి వర్గాలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగనున్న విస్తృత స్థాయి అత్యవసర సమావేశంలో ఇంటింటి బిజెపిపురోగతి, బస్సు యాత్ర నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.   

మరోవంక, జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ తో తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బహిరంగసభలో చంద్రబాబు కుటిల రాజకీయాలను కడిగి వేయడంతో పాటు, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించే అవకాశం ఉంది. ఒక వంక కాంగ్రెసేతర పక్షాలను కలుపుకొని బిజెపిపై ఉమ్మడి పోరాటానికి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు రాజకీయ సమాలోచనలు జరుపుతూ ఉండగా, మరోవంక సొంత రాష్ట్రంలో ఆయనను కట్టడి చేయడంకోసం, ఆయన పాలన అసలు స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేందుకు బిజెపి భారీ కసరత్తు చేస్తున్నది. 

డిసెంబర్ చివరి వారంలో అమరావతిలో ధర్మపోరాటం ముగింపు సభను పెద్ద ఎత్తున జరిపి, బీజేపీయేతర పక్షాల జాతీయ నేతలను ఆహ్వానించి, ఒక విధంగా బలప్రదర్శనకు చంద్రబాబునాయుడు సమాయత్తం అవుతున్నారు. ఈ సభ పూర్తి కాగానే బీజేపీకి చంద్రబాబుపై ముప్పేట దాడికి సమాయత్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సంబంధించి మోదీ ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉంది. 

ఇప్పటికే పలువురు టిడిపి ప్రముఖులు పలు అవినీతి కార్యకలాపాలతో ఆదాయపన్ను, ఈడీ శాఖల దాడులకు గురవుతున్నారు. మరి కొందరి నేతల అవినీతి బట్టబయలు అయ్యే అవకాశం ఉంది. అమరావతి భూముల కుంభకోణంతో పాటు వివిధ పరిశ్రమలకు ఇస్తున్న భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలను సహితం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ ఎంపీ జీవిల్ నరసింహారావు పలు తీవ్రమైన ఆరోపణలను చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు చంద్రబాబునాయుడు సమాధానాలు చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. 

తెలంగాణలో పదేళ్ల తర్వాత అన్ని స్థానాలలో ఒంటరిగా పోటీ చేసిన బిజెపి అనూహ్యంగా పలు జిల్లాల్లో గట్టి పోటీ ఇచ్చింది. పలు చోట్ల బిజెపి అభ్యర్థులు రెండో స్థానంలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. టిడిపితో కలసి పోటీ చేసినప్పటికన్నా ఇప్పుడు సొంతంగా తమ సీట్లను పెంచుకోగలమని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా సీట్లు, ఓట్లు పెంచుకోవడంతో ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావం చూపనున్నారు. 

అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ లో సహితం తమ బలం పెంచుకోవడంతో పాటు ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక పాత్ర వహించడం కోసం బిజెపి పావులు కడుపుతున్నది. తెలంగాణలో బిజెపి రాష్ట్ర స్థాయి నాయకత్వం చాలావరకు హైదరాబాద్ నగరంకె పరిమితం అయిన్నట్లు భావిస్తున్నా ఈ పర్యాయం గ్రామీణ ప్రాంతాలలో సహితం పలువురు అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణలో కన్నా ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి రాష్ట్రం అంతా బలమైన నాయకత్వం ఉంది. మరికొందరు బలమైన నాయకులు బిజెపి వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకొనే రాబోయే రోజులలో చంద్రబాబు అంచనాలను, ఎత్తుగడలను తలకిందులు చేసే విధంగా బీజేపీ వ్యూహాలను అమలు చేయనున్నది.