తెలంగాణాలో బిజెపి సీట్లు, ఓట్లు పెరుగుతాయ్‌

తెలంగాణలో బిజెపి బలమేమిటో ప్రత్యర్థి పార్టీలకు తెలిసొచ్చిందని, ఫలితాల అనంతరం తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, మజ్లిసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే అందులో చేరే విషయమై ఆలోచిస్తామని, పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

బిజెపికి ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య పెరుగుతుందని, ఓట్ల శాతంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. ‘దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో 118 స్థానాలకు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. పార్టీ బలోపేతానికి చేసిన ఉద్యమాలు, యాత్రలు కలిసివచ్చాయి. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా జాతీయస్థాయి ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇవన్నీ అనుకూలించాయి’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 

60 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీతో కలుస్తారా? అని ప్రశ్నించగా.. ‘ఫలితాలు వచ్చాక పార్టీల బలాబలాలు చూస్తాం. కాంగ్రెస్‌, మజ్లిస్‌ భాగస్వామ్యం లేని పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే కలిసే విషయమై ఆలోచిస్తాం’ అన్నారు.  టీఆర్‌ఎస్‌  కు మజ్లిస్‌ మద్దతును ప్రస్తావించగా..బిజెపికి  ఎంఐఎం బద్ధశత్రువని, ప్రభుత్వ ఏర్పాటులో మజ్లిస్‌తో కలిసే పార్టీతో బిజెపి చేరబోదని స్పష్టంచేశారు. 

ముషీరాబాద్‌లో తన గెలుపు ఖాయమని, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల గురించి అమిత్‌షా ఆరా తీశారు. లక్ష్మణ్‌తో శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? భాజపాకు ఎన్ని సీట్లు వస్తాయని అడిగినట్లు తెలిసింది.