ఓ కుటుంబంతో మంటగలిచిన పని సంస్కృతి

సుదీర్ఘకాలం అధికారంలో ఓ కుటుంబం పుణ్యమాని దేశంలో పని సంస్కృతి మంటగలిచిపోయిందని, తద్వారా అభివృద్ధికి నోచుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశంలో పరిస్థితి పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉండేదని మోదీ నిప్పులు చెరిగారు. దైనిక్ జాగారణ్ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన ‘జాగరణ్ ఫోరం’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ‘కొందరు వ్యక్తులు పేర్ల ముందు పెద్ద కుటుంబాల ఇళ్లపేర్లు తగిలించుకుని అధికారంలోకి వచ్చారు. వారి వల్ల దేశానికి, ప్రజలకు వొనగూరిందేమీ లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి’అని మోదీ ఆరోపించారు. 

ఈ సందర్భంగా నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులపై పరోక్ష దాడి చేశారు.‘ఈనాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పు వచ్చిందో మీరు చూశారు. దానికి అనేక ఉదాహరణలున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరిగింది’అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబీ హటావో నినాదం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందని ప్రధాని విమర్శించారు. గరీబీ హటావో నినాదం ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగపడిందని ఆయన నిప్పులు చెరిగారు. 

 1971 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ఇచ్చారని మోదీ గుర్తుచేశారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలనకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ సదుపాయం, బ్యాంకు అకౌంట్లు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. 

సామర్ధ్యం పెంపు, వనరుల సమీకరణ, సంస్కృతి, భద్రత లక్ష్యంగా నవ భారత్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మోదీ అన్నారు. గతంలోలా నిధులకు ఎలాంటి కొరత లేదని ఆయన ఉద్ఘాటించారు. గతంలో పని సంస్కృతి ఉండేది కాదని తాము వచ్చాక దానికి ప్రాధాన్యత ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.‘ మన యువత ఎంతో ప్రతిభావంతులు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారు. వారిని ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు’అని ఆయన తెలిపారు. 

సహజవనరులను సద్వినియోగం చేసుకుంటే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని మోదీ చెప్పారు. జీఎస్టీ వచ్చాక పన్ను చెల్లింపుదారులు సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వెల్లడించారు. 67 ఏళ్ల స్వాతంత్య్ర భారత్‌లో కేవలం 38 శాతం ఇళ్లకే మరుదొడ్ల సౌకర్యం ఉండేదని, ఈ నాలుగేళ్ల బీజేపీ ప్రనుత్వం 95 శాతం మరుగుదొడ్లు నిర్మించినట్టు మోదీ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో ఇటీవల తాము నిర్వహించిన ఎన్నికల ప్రచారం వల్ల బీజేపీకి మంచి ఫలితాలే వస్తాయన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు.

 బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దేశాభివృద్ధికి కంకణబద్ధులమయ్యామని, ఇం దులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని స్వదేశానికి రప్పించడానికి అవసరమైన లాంఛనాలను ప్ర భుత్వం పూర్తి చేస్తున్నదని, త్వరలోనే ఇది ఫలి స్తుందని తెలిపారు.