సిద్దును వెనుకేసుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్

మాజీ ప్రధాని వాజపేయి మృతితో దేశం అంతా సంతాప దినాలు పాటిస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వికారంకు వెళ్ళడం పట్ల స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. చివరకు సొంత కాంగ్రెస్ పార్టీ నుండి కూడా దూషణలు, మందలింపులు ఎదురై ఒక్కరు కూడా తన చర్యను సమర్ధించే వారు లేని సమయంలో సిద్దు విమర్శకులపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు కుడా.

సిద్ధూ ఓ శాంతి దూత అని, ఆయనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న వాళ్లు ఉపఖండంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నట్లే అంటూ విమర్శకులను పాకిస్తాన్ ప్రధాని సున్నితంగా మందలించారు. శాంతి లేకుండా మన ప్రజలు అభివృద్ధి సాధించలేరని ఆయన స్పష్టంచేశారు. తన ప్రమాణస్వీకార మహోత్సవానికి వచ్చిన సిద్ధూకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఇక కశ్మీర్ అంశం సహా ఇండియా, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న విభేదాలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని ఇమ్రాన్ స్పష్టంచేశారు. మన దేశాల్లోని పేదరికాన్ని పారదోలి, ప్రజలు అభివృద్ధి సాధించాలంటే మన మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, రెండు దేశాల మధ్య వర్తకం జరగాలి అని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ప్రజలు సిద్ధూకు తమ ప్రేమానురాగాలను పంచారని ఈ సందర్భంగా ఇమ్రాన్ అన్నారు.

ప్రధానంగా పాకిస్తాన్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అధినేత పక్కన కూర్చోవడం, మన సైనికులను పొట్టన పెట్టుకొంటున్న పాక్ సైనికాధిపతి ని కౌగలించు కావడంతో సిద్దు ఇక్కడ తీవ్ర విమర్శలకు గురి కావలసి వచ్చింది.