అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబు నైజం

పిల్ల కాంగ్రెస్‌కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్‌కు ఓటేసినట్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడు తల్లి కాంగ్రెస్‌ చంకెక్కారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు.  అన్నం పెట్టిన చేతిని నరకడం చంద్రబాబు సహజ గుణమంటూ కాకినాడలో విమర్శించారు.

 బీజేపీ నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకోబట్టే దొంగలంతా ఒకటవుతున్నారని తెలిపారు. అందుకే సూట్‌కేస్‌ కంపెనీలు కూడా మూతపడుతున్నాయన్నారు. కేసుల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం దొంగ చంద్రబాబు ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడో అందరికి తెలుసన్నారు.

మాతో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు కూడా బాబు దొంగగానే కనిపించాడంటూ కన్నా ఆరోపించారు. 2014లో చంద్రబాబు నేను మారాను నమ్మండంటూ వస్తే మాతో పాటు మోదీ కూడా నమ్మారని తెలిపారు. ఎస్పీవీ ఏర్పాటు చేయకుండా కేంద్రం నుంచి రూ. 16, 500 కోట్లు చంద్రబాబు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

 నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారంటూ ఆరోపించారు. పిల్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. అందులో కొందరికి మంత్రి పదవులను కట్టబెట్టి బాబు తన ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారంటూ కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.