బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో భయపడుతున్న మమతా : అమిత్ షా

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు బ్రేక్ పడటంతో  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రథయాత్రలకు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. 

అయితే రథయాత్ర రద్దు కాలేదని, తాత్కాలికంగా వాయిదా పడిందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 'ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరుతో శుక్రవారం తలపెట్టిన బీజేపీ రథయత్రకు హైకోర్టు అనుమతి నిరాకరిచడంతో అమిత్‌షా పర్యటన రద్దయింది.

కాగా, మమతాబెనర్జీనే తమ రథయాత్రలను అడ్డుకుంటున్నారని, ఇది అధికార దుర్వినియోగమే కాకుండా, అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. రథయాత్రలు రద్దు కాలేదని, వాయిదా మాత్రమే పడ్డాయని, వాటిని జరిపితీరుతామని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ అధికారులు కూడా మమత ఆడమన్నట్టే ఆడుతున్నారంటూ విమర్శించారు. 

అయితే తాము బెదిరేది లేదని, బెంగాల్‌లో 20కి పైగా ర్యాలీలు తీస్తామని స్పష్టం చేశారు. తాము గతంలో ర్యాలీలు తీసిన తర్వాత ఎలాంటి హింసా జరగలేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్ హింసకు లెక్కకు మిక్కిలిగా తమ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 

హింసను ప్రేరేపించడం ద్వారా పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని మమత నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరిగిన పంచాయత్ ఎన్నికలలో బీజేపీకి చెప్పుకోదగిన విజయాలు సాధించినప్పటి నుండి ఆమెలో భయం నెలకొన్నదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని, తమ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజాచైతన్యం తీసుకువస్తారని అమిత్‌షా చెప్పారు.