వత్తిడులకు లొంగలేదు .. కష్టాలలో క్రుంగలేదు

దివంగత మాజీ ప్రధాని వాజపేయి వత్తిడిలో కృంగిపోవడం, కష్టాల్లో నిరాశపడటం ఎన్నడూ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాజపేయికి సంతాపంగా జరిపిన అఖిలపక్ష ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిగా పనిచేసిన కాలంలోగానీ, విపక్ష నేత గా ఉన్నపుడు గానీ ఎలాంటి ఒత్తిళ్లకూ వాజ్‌పేయి లొంగలేదని, సైద్ధాంతికంగానూ రాజీపడలేదని, ప్రతికూల పరిస్థితులెదురైనా ఆశావహం గా ఉండేవారని ప్రధాని మోదీ తెలిపారు.

13రోజుల పాటు వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఏ పార్టీ సుముఖత చూపలేదని, అందుకే అప్పుడు తమ ప్రభుత్వం పడిపోయిందని ఆయన చెప్పారు. అలా అని వాజపేయి తన ఆశ, ఆశయాలను ఎన్నడూ వదులుకోలేదని, మరింత అంకితభావంతో ప్రజలకు సేవ చేసి మార్గదర్శకులుగా నిలిచి తిరిగి పూర్తికాలం ప్రధానిగా చేశారని అన్నారు.

కాశ్మీర్ అంశంపై కొన్నిదేశాల వైఖరిని మార్చడంలో వాజపేయి కృతకృత్యులయ్యారని పేర్కొంటూ వాజపేయి కారణంగానే ఉగ్రవాదం అంశం ప్రపంచం దృష్టికి వచ్చిందని చెప్పారు. సభ అధికార విపక్షాలు రెండింటినీ ఒకచోట చేర్చింది. పార్టీలకతీతంగా అందరు నేతలూ వాజ్‌పేయిని ఆయన అనుసరించిన మార్గాన్ని కొనియాడారు. సంకీర్ణాలు ఒక ఆనవాయితీగా మారిన సమయంలో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌, ఎస్పీ, టీడీపీ, తృణమూల్‌, పీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే.. ఇలా అన్ని పార్టీల నేతలూ ఇందులో పాల్గొన్నారు

వాజపేయి హయాంలోనే కొత్తగా ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండా రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని మోదీ గుర్తు చేసారు. వాజపేయి ధైర్యసాహసాల వల్లే భారత్ అణుశక్తి గల దేశంగా ప్రపంచం సరసన నిలిచిందని చెబుతూ  అణుపరీక్షలు నిర్వహిస్తున్న విషయం మూడో కంటికి సైతం తెలియకుండా విజయవంతంగా నిర్వహించి ఒక గొప్ప నాయకత్వం ఉంటే ఏమైనా చేయవచ్చునని నిరూపించారని మోదీ ప్రశంసించారు.

తన భావాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదని అంటూ పార్లమెంట్‌లో కొత్త సంప్రదాయాలకు ఆయన ఆద్యుడిగా నిలిచారని మోదీ పేర్కొన్నారు. దేశ ఉన్నతి కోసం ఆయన జీవితాన్ని ధారవోశారు. సంకీర్ణ రాజకీయాలెలా నడపాలో దిశా నిర్దేశం చేశారు’’ అని వివరించారు.

వాజపేయి నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అంటూ ఇటీవలే కన్నుమూసిన వాజపేయిని స్మృతిస్తూ మాట్లాడడమన్నది తనకెంతో బాధాకరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. వాజపేయి సంస్మరణ సభకు తాను కూడా హాజరయ్యే రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి దైవ దూత అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కొనియాడారు. అధికార, ప్రతిపక్షాలకు నేడున్న దూరం వాజపేయి హయంలో ఉండెడిది కాదని అంటూ రాజకీయ విబెధలతో సంబంధం లేకుండా అందరిని కలుపుకు పోయేవారని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబి ఆజద్ కొనియాడారు. 

ఈ సంస్మరణ సభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్, ప్రతిపక్ష నేతలు ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్, ఆనంద్ శర్మ, డి రాజా, సతీష్ మిశ్రా, యోగాగురు బాబా రామదేవ్, వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య, మనుమరాలు నీహారిక తదితరులు  పాల్గొన్నారు.