తెలంగాణ ఎన్నికలపై మోదీ తెలుగులో ట్వీట్‌

తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 119 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. 

‘ఇవాళ ఎన్నికల రోజు. తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

మరోవంక బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘అభివృద్ధి ఆధారిత ప్రభుత్వం కోసం తెలంగాణలోని సోదర, సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండగలో తప్పకుండా పాల్గొనాలి’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు.