బిజెపి రధ యాత్రకు మమతా బ్రేక్...

పశ్చిమ బెంగాల్‌లో బిజెపి  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన రథయాత్రతో అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలవరం చెందుతున్నారు. రాష్ట్రంలో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చే ఎన్నికలలో తన అధికారాన్ని సవాల్ చేసే స్థాయికి చేరుకొంటుందని ఆందోళన చెందుతున్నారు. దానితో రధ యాత్ర జరుగకూడదని అడ్డంకులు కల్పిస్తున్నారు. యాత్రకు అవసరమైన పోలీస్ అనుమతి లభించక పోవడంతో బిజెపి హై కోర్ట్ ను ఆశ్రయించింది. 

 కోల్‌కతా హైకోర్టు ఒకరోజు ముందు అనుమతి నిరాకరిస్తూ, విచారణను వాయిదా వేసింది.  రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసమంటూ ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ పేరిట శుక్రవారం నుంచి నెల రోజుల పాటు బిజెపి  ఈ యాత్రను నిర్వహించడానికి నిర్ణయించింది. కూచ్‌బిహారీ నుంచి ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం ప్రారంభించాల్సి ఉంది. యాత్ర ముగింపులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనగలరని భావిస్తున్నారు. ఈ మధ్యలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే విధంగా కార్యక్రమం రూపొందించారు. 

మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందున రథయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంతీ సాకు చూపి నివేదించడంతో హైకోర్టు జనవరి 9 వరకు నిలిపి వేయాల్సిందిగా గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి చెప్పారు. బీజేపీకి  తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో శుక్రవారం ఉదయం అపీల్‌ చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.  

ఇలా ఉండగా, బీజేపీ నాయకత్వం కోర్టు తీర్పు వెలువడే వరకూ రథయాత్రను నిలిపివేస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, కూచ్‌బెహార్ రావడానికి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గియా తెలిపారు. 

కూచ్‌బెహర్ నుంచి అమిత్‌షా జరిపే యాత్ర వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందున దానికి అనుమతి ఇవ్వడం లేదని అడ్వకేట్ జనరల్ కిషోర్‌దత్తా కలకత్తా హైకోర్టుకు ఇంతకు ముందు తెలియజేశారు.

అయితే ఈ యాత్రకు సంబంధించి తలెత్తనున్న పరిస్థితుల గురించి ఆయా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లు సవివరమైన నివేదికలు ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశించింది.