వర్షాలతో ఇబ్బందు పడుతున్నా రైతులలో హుషారు

రెండు, మూడు రోజులుగా ఒక్క మహబూబ్‌నగర్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నా పాటలకు ఇబ్బంది ఉండదని రైతులు ఆనందపడుతున్నారు. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయనే వార్తలతో రైతులు కొంత ఇబ్బందిపడుతున్నా వానకాలం పంటలకు సాగునీటి కొరత లేకుండా పోవడం సంతోషాన్నిస్తున్నది. యాసంగి పంటల సాగుకు కూడా భరోసా దొరికిందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్రస్తుత వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. కీలక సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఈసారి వరి అంచనాలకు మించి సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు 18 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈ వర్షాలతో మిగిలిన చోట్ల కూడా వరి నాట్లు పడతాయని, ప్రాజెక్టుల కింద కూడా వరి నాట్లు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ఖరీఫ్‌ పంటలు నీట మునిగాయి. ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల మేర పంటలు నీటిమునిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోనే 1.23 లక్షల ఎకరాల మేర పంటలు నీటమునిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పత్తి, పెసర పంటలు మునిగినట్లు చెబుతున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలో మిరప నారు మునిగిపోవడంతో పనికి రాకుండా పోయింది.

అలాగే చేతికి వచ్చే దశలో పెసర పంట పూర్తిగా నాశనమైందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.76 లక్షల ఎకరాల్లో పెసర వేయగా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో పెసర కాయలు బూజుపట్టి పాడైపోయాయని అధికారులు పేర్కొన్నారు.

పూర్వ ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అనేక చోట్ల సోయాబీన్, జొన్న, పత్తి పంట మునిగిపోయింది. రెండు, మూడు రోజుల్లో ఆయా చేల నుంచి నీరు బయటకు పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటికే నీటమునిగిన పంటలు దెబ్బతినే అవకాశమే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.

 ఉత్తర తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నది. మరో రెండ్రోజులపాటు గ్రేటర్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

జోరుగా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు పోటెత్తుతున్నాయి. చెరువులు నిండా నీటితో తొణికిసలాడుతున్నాయి. వరదలతో పలుచోట్ల సాధారణ జనజీవనం స్తంభించింది. వాగులు పొంగిపొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.