బిజెపి అభ్యర్థిగా అందాల నటి మాధురీ దీక్షిత్ పోటీ !

బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారా? అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని పుణె స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా మాధురీ దీక్షిత్ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ ఏడాది జూన్‌లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ చేపట్టిన సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా మాధురీ దీక్షిత్‌ని ముంబైలోని ఆమె నివాసంలో కలుసుకుని మోడి ప్రభుత్వ విజయాలను వివరించారు. పుణె లోక్‌సభ స్థానానికి మాధురి పేరును పరిశీలిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర సీనియర నాయకుడు ఒకరు వెల్లడించారు.

పుణె లోక్‌సభ స్థానంలో ఆమెకు విజయావకాశాలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో పుణె లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి బిజెపి కైవశం చేసుకుంది. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి అనిల్ షిరోలె మూడు లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. 

బీజేపీ ప్రతి ఎన్నికల్లో, ప్రతి చోటా పలువురు కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉండటం తెలిసిందే. అదే విధంగా దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఇతరులకు ఆశ్చర్యం కలిగించే పలువురు అభ్యర్థులను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.