తిత్లీ బాధితులకు కేంద్ర రూ.539.52 కోట్లు సాయం

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను సాయం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.539.52 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన గురువారం భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ పలు కీలక అంశాలపై చర్చించింది. నాగాలాండ్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన నిధులపై ఈ ఉన్నతస్థాయి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్‌ నెలలో తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా పలాస, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో కొబ్బరి, జీడిమామిడితో తోటలతో పాటు ఇతర అంతర పంటలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 

సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం తీవ్రతను కేంద్రానికి నివేదించారు. ఇందులో భాగంగా చంద్రబాబు కూడా సాయం కోసం కేంద్రానికి లేఖలు రాశారు. తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను మంజూరు చేసింది.

అదే విధంగా జాతీయ విపత్తు స్పందన నిధి నుండి కేరళకు రూ 3048.39 కోట్లు, నాగాలాండ్ కు రూ 131.16 కోట్లను మంజూరు చేశారు.