జలప్రళయం సృష్టించనున్న వరదలు!

గతంలో ఉత్తరాఖండ్ లో, తర్వాత చెన్నయి మహానగరంలో, ఆ మధ్య ముంబాయిలో, తాజాగా కేరళలో భారీ వర్షాలు ఏ విధంగా జలప్రళయలు సృస్తిస్తున్నాయో మనం చేస్తున్నాము. పర్యావరణ సమతూల్యం దెబ్బతింటూ ఉండడంతో ఇటువంటి ప్రళయాలు మరిన్ని ఎదురు కాకా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వచ్చే పదేండ్లలో వరదల కారణంగా 16వేల మందికి పైగా ప్రజలు మరణించవచ్చని, రూ.47వేల కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లవచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) అంచనా వేసింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్డీఎంఏ దేశవ్యాప్తంగా 640 జిల్లాలో సర్వే నిర్వహించి ఈ అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. వరదల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్న రాష్ర్టాలలో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వరదల కారణంగా ఈ రాష్ర్టాల్లో ప్రభావం పడనున్న భూ విస్తీర్ణం వివరాలు కూడా వెల్లదించారు.

ఇప్పటికే కేరళతోపాటు దేశంలోని అనేక రాష్ర్టాలు వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్డీఎంఏ అంచనాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రమాద అంచనా, నష్ట నివారణ లేక తగ్గింపు, సహాయ పునరావాసాలకు సంబంధించి తీసుకున్న విపత్తుల వల్ల కలిగే ముప్పును నిరోధించే (డీఆరార్) చర్యల ఆధారంగా ఆయా రాష్ర్టాల పనితీరుపై కేంద్ర హోం శాఖ ఒక జాతీయ సూచిని రూపొందించింది.

అయితే అనేక రాష్ర్టాలు విపత్తు వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు సరైన చర్యలు తీసుకోవటం లేదని ఆ సర్వే అభిప్రాయపడింది. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ మినహా ఇతర రాష్ర్టాలు విపత్తుల వల్ల కలిగే నష్టంపై అంచనాలను కూడా రూపొందించలేదని పేర్కొంది. దేశంలో విపత్తుల గురించి ముందుగానే హెచ్చరించి, తద్వారా జరిగే నష్టాన్ని నివారించేందుకు మనకు అత్యంత అధునాతన ఉపగ్రహాలు, హెచ్చరిక వ్యవస్థలు ఉన్నప్పటికీ అధికారులు వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదని తెలిపింది.

విపత్తు ముప్పు తగ్గింపు, విపత్తు అనంతర పునర్నిర్మాణ చర్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప నిర్దిష్టంగా ఎటువంటి విధానాలను అమలు చేయడం లేదని పేర్కొంది.