తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్లాగూ ఉన్న ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంకు మాత్రమే పరిమితమై ఉన్న పార్టీగా పేరొందిన బీజేపీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో పట్టు సాధించగలిగిన్నట్లు కనబడుతున్నది. మొత్తం ప్రచార వ్యూహంలో గ్రామీణ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని చేయడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ లో తమ పట్టును కాపాడుకొంటూనే మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకొనే ప్రయత్నం చేశారు.
అందుకే జాతీయ నేతల ప్రచారం మూడొంతులకు పైగా జిల్లాల్లోనే సాగేలా చూసారు. భూపాలపల్లి, నారాయణపేట వంటి మారుమూల ప్రాంతాలకు సైతం బిజెపి కీలక నేతలను రప్పించి ప్రచారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారం గ్రామీణ ప్రాంతాలలో అవకాశాలు మెరుగుపడ్డాయని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో బిజెపి గెలుపొందిన ఐదు స్థానాలు సహితం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. జిల్లాల్లో ఒక్క సీట్ కూడా గెల్చుకోలేక పోయారు. అందుకనే ఈ సారి జిల్లాలోకి చొచ్చుకుపోయి విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. నవంబరు 25న అమిత్‌షా రాకతో ప్రారంభమై.. డిసెంబరు 5న చివరిరోజు యోగి ఆదిత్యనాథ్‌తో ముగింపు వరకు జరిగిన ప్రచారంలో అగ్రనేతలు మూడొంతులకు పైగా తెలంగాణ జిల్లాల్లోనే పర్యటించారు.
పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా 12 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలో మూడు రోడ్‌షోల్లో పాల్గొంటే మిగిలిన 9 సభలు జిల్లాల్లోనే. ప్రధాని మోదీ సభలు హైదరాబాద్‌లో ఒకటి పోతే మిగిలిన రెండు నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో జరిగాయి.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ 8 సభల్లో పాల్గొంటే అందులో హైదరాబాద్ పరిధిలో గోషామహల్ ఒక్కటే. మిగిలిన ఏడు జిల్లాల్లోనే. భూపాలపల్లి వంటి మారుమూల నియోజకవర్గంతో పాటు పార్టీ గట్టి ఆశలు పెట్టుకున్న కరీంనగర్, ముథోల్‌లో యోగి ప్రచారం చేసి వచ్చారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం చేసిన 8 నియోజకవర్గాలూ జిల్లాల్లోనే ఉన్నాయి.
కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, హన్స్‌రాజ్ గంగారం అహిర్ తదితరులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్సింగ్ల ప్రచారం దాదాపుగా గ్రామీణ జిల్లాల్లోనే సాగింది.
పైగా, పలు నియోజకవర్గాలలో గత నాలుగున్నరేళ్లుగా పట్టుదలగా పనిచేస్తున్న పార్టీ నేతలు పలు చోట్ల పోటీ చేయడంతో ఒక విధంగా సానుకూల వాతావరణం ఏర్పాటైన్నట్లు చెబుతున్నారు. బిజెపి అభ్యర్థులు మొత్తం మీద 30కు పైగా నియోజకవర్గాలలో బలమైన పోటీలో నిలబడ్డారు. దానితో ఇతర పార్టీల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.