అగస్టా హెలికాప్టర్ల స్కాంలొ సొనియా పై గురి !

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ ను భారత్ కు రప్పించడంతో బిజెపి నేతలలో హుషారు కనిపిస్తున్నది. అతనిని విచారించడం ద్వారా కాంగ్రెస్ లోని అగ్రనేతల బండారం బైట పడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ కుంభకోణంలో ముడుపులు చేరినట్లు ఆధారాలు లభించగలవని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ పేరు ప్రస్తావనకు రాగలదని ఎదురు చూస్తున్నారు. దానితో బిజెపి నేతలు  దూకుడుకు పెంచారు. ఒక విధంగా కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడినట్లు అవుతున్నది. 

మిషెల్‌ చేత  చేత నేతల రహస్యాలను కక్కిస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజస్థాన్ లోని ఎన్నికల ప్రచార సభలలో వెల్లడించడం ప్రాధాన్యతను సంతరింప చేసుకోంది.  ‘బ్రిటిష్‌ జాతీయుడైన 57 ఏళ్ల నిందితుడు ఎవరి తరఫునో దళారీగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆ వ్యక్తి సేవల్ని అనేకమంది రాజకీయ నాయకులు పొందారు. ఎందరికో ముడుపులు సమర్పించిన దళారీని మేం వెనక్కి రప్పించాం. ఇప్పుడతను ఎవరెవరి పేర్లను వెల్లడిస్తాడో, ఇదెంతవరకు వెళ్తుందో వేచి చూడండి. ఇది రూ.వేల కోట్ల వ్యవహారం కావడంతో ఆ (గాంధీల) కుటుంబం మొత్తం వణికిపోతోంది’ అని వెల్లడి చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, అవినీతి పర్యాయ పదాలుగా మారినట్లు ప్రధాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ జీవన విధానమే అవినీతి అని మోదీ ధ్వజమెత్తారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తుల కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. చాయ్‌వాలా ధైర్యమే కాంగ్రెస్‌ అగ్రనేతలైన సోనియా, రాహుల్‌గాంధీలను కోర్టుకు ఈడ్చిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఆదాయపన్ను రిటర్న్స్‌ పునఃపరిశీలనను వారు తప్పించుకున్నారని ధ్వజమెత్తారు. 

‘వారి ఐ.టి.రిటర్న్స్‌పై మేం నిన్న సుప్రీంకోర్టులో గెలిచాం. పునః మదింపు చేసే హక్కు సర్కారుకు ఉందని కోర్టు చెప్పింది. ఇప్పుడు వారు (సోనియా, రాహుల్‌) ఎలా తప్పించుకుంటారో చూద్దాం. ప్రజలంతా ఈ చాయ్‌వాలాకు ఇచ్చిన మద్దతుతోనే అవినీతిపై పోరాడి నిందితులను కటకటాల వెనక్కి నెట్టగలుగుతున్నాను' అంటూ భరోసా వ్యక్తం చేశారు. 

బ్రిటిష్ జాతీయుడైన మిషెల్ ను మరో దేశం నుండి రప్పించడం అంటే అంత తేలికగా జరిగిన విషయం కాదు. దుబాయి నుండి తప్పించుకు పోవడం కోసం మిషెల్ దౌత్యపరంగా భారత్ పై ఎంతో వత్తిడి తీసుకు వచ్చినప్పటికీ సాధ్యం కాలేదు. దానితో మిషెల్ నుండి రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించగల సమాచారం లభించగలదని బిజెపి నేతలు భావిస్తున్నారు. 

మరొవంక, అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల స్కాంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్‌ను దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిందని, ఈ స్కాంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. మైఖేల్‌ను సీబీఐ మన దేశానికి తెచ్చిందని, దీనిపై స్పందించాలని ఆయన కోరారు. మైఖేల్‌ను రక్షించాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. 

స్కాంల్లో కూరుకుపోయిన యూపీఐ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఈ విషయమై నోరుమెదపకుండా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. వీవీఐపీ హెలికాప్టర్ స్కాం రూ.3600 కోట్లని, ఈ కేసులో ఏజన్సీ చురుకుగా వ్యవహరించినందు వల్ల దుబాయ్ నుంచి మైఖేల్‌ను తెచ్చామని పెర్కొన్నారు.