పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్లనే ఈ విపత్తు

నేడు కేరళను కకావికలం చేస్తున్న వర్షాలు, వరదలు మొత్తం దేశ ప్రజలకు హెచ్చరికలు  పంపుతున్నాయి. ఇవి పకృతి విపత్తు కాదని, మనవ తప్పిద ఫలితమే అని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. గతంలో పర్యావరణ హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకొనక పోవడం వల్లనే ఇంతటి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిన్నట్లు చెబుతున్నారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలను ధ్వంసం చేయడం వల్లనే కేరళకు ఈ విపత్తు దాపురించినట్టు స్పష్టం అవుతున్నది.

 

కేరళలో ఐదేండ్లకోసారి అధికారాన్ని పంచుకునే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు పర్యావరణ నిపుణులు చేసిన హెచ్చరికలను బుట్టదాఖలు చేయడం వల్లనే మలయాళీలు నేడు జలప్రళయాన్ని ఎదుర్కొంటున్నట్టు విదితమవుతున్నది. వరదల కారణంగా దెబ్బతిన్న కేరళలోని ఆయా ప్రాంతాలను భౌగోళికంగా విశ్లేషిస్తే, అవన్నీ పర్యావరణం పరంగా సున్నితమైనవని వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పర్ట్ ఎకాలజీ పానెల్ రిపోర్ట్ (డబ్ల్యూజీఈఈపీ) ఇంతకుముందే హెచ్చరించింది. అయితే, దీనిని ఆ రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదు.

 

పైగా, ఈ నివేదిక ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఇంతకుముందున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. వరదలతో గత పది రోజుల్లో వయనాడ్, ఇడుక్కి ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితోపాటు మున్నార్, తామరస్సేరి, వైతిరి, తిరువంబాడి కూడా సున్నితమైన ప్రాంతాలలోనే ఉన్నట్టు డబ్ల్యూజీఈఈపీ గతంలోనే హెచ్చరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ నీట మునిగి ఉన్నాయి.

కేరళలోని 15 తాలూకాలు అత్యంత ముప్పు ఎదురయ్యే మొదటిజోన్ పరిధిలో ఉన్నాయని, రెండు తాలూకాలు రెండో జోన్‌లో, మరో ఎనిమిది మూడో జోన్‌లో ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ మొదటి జోన్ పరిధిలో ఉన్న ఇడుక్కి జిల్లాలో భారీగా అక్రమ నిర్మాణాలకు పాలకులు అనుమతులిచ్చారు. ప్రస్తుతం ఇడుక్కితోపాటు మున్నార్, వయనాడ్‌లపై కూడా ప్రకృతి తన ప్రతాపాన్ని చూపింది. పశ్చిమ కనుమలకు సమీపంలో ఉన్న ఒకటవ జోన్‌లో కీలకమైన అటవీ ప్రాంతాలున్నాయి.

అక్కడి భూములను అటవీయేతర పనులకు లేదా వ్యవసాయానికి ఉపయోగించరాదని నిషేధం విధించారు. అయినప్పటికీ పెరుగుతున్న జనాభా కోసం అక్కడ నివాస గృహాలను నిర్మించారు. ఆ గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు. రెండో జోన్‌లో భారీగా హోటళ్లు, రిసార్ట్‌లు పుట్టుకొచ్చాయి. మూడో జోన్‌లో భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించారు. దీనికితోడు నివాస ప్రాంతాలకు 50 మీటర్ల పరిధిలోనే క్వారీ తవ్వకాలకు అనుమతులిచ్చారు.

అడవులకు నివాస ప్రాంతాలకు మధ్యనున్న ప్రాంతాలను పరిరక్షించ లేకపోతే ఆ ప్రాంతం పేకమేడలా కూలిపోతుందని, కొండచరియలు విరిగిపడటం లేదా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశమున్నదని,  వీటి వల్ల జీవనోపాధిని కోల్పోవడమే కాదు ప్రాణాలు కూడా పోతాయని అంటూ డబ్ల్యూజీఈఈపీ నివేదిక రూపొందించిన బృందం నాయకుడు ఆచార్య మాధవ్ గాడ్గిల్ అప్పుడే స్పష్టం చేసారు.

ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లనే పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయ ప్రాంతాలలో కొండచరియలు విరిగి పడుతున్నాయని, ఇడుక్కి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. పెద్ద పెద్ద చెట్లను పెంచడం ద్వారా భూమి కోతను నివారించవచ్చని, తద్వారా కొండలు కూలిపోవడం తగ్గుతుందని సూచించారు.