బిజెపి వస్తే ఎంఐఎం కనుమరుగే

  తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తే ఎంఐఎం పార్టీ కనుమరుగవుతుందని  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు.  భైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోమాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలను తెరాస ప్రభుత్వం వంచించిందని ధ్వజమెత్తారు. 

తెలంగాణలో కుటుంబపాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తూ న్నారు.  టీఆర్‌ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుమారుడు, కుమార్తెలకు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడికి వారసత్వ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

దేశ అభివృద్ధి, సుపరిపాలన బిజెపితోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టిడిపి హయాంలో ఉమ్మడి రాష్ట్రం దోపిడీకి గురైందని ఆదిత్యనాథ్‌ విమర్శించారు. అభివృద్ధి అనే అంశం వారి ఎజెండాలోనే లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే ప్రధాని మోదీ నేతృత్వంలో 2014లో ఏర్పాటైన ప్రభుత్వం.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు.

లౌకికవాదం పేరిట కాంగ్రెస్ పార్టీ‌ ప్రజలను విభజించి పాలిస్తుందని ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపర్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిజెపి  ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ నినాదంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌, టిడిపి,  టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు చేస్తాయా అని ప్రశ్నించారు.

అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అధికారం దాహంతో మతతత్వ పార్టీలతో జతకడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీజేపీ కీలక శక్తిగా మారబోతోందని కరీంనగర్ లో ధీమా అవ్యక్తం చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారంతా సామాన్యులేనని, ఇతర పార్టీల్లో కుటుంబ వారసులే నాయకులుగా ఉన్నారని ఆయన విమర్శించారు. మోదీ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని యోగి పేర్కొన్నారు.