కాంగ్రెస్‌కు ప్రధాని అభ్యర్థి కూడా లేరు

కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ లేదని, కనీసం ప్రధాని అభ్యర్థి కూడా లేరని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరడంతో జైపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కుల మతాలను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.

కానీ బిజెపి అలా కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు.  రాజస్థాన్‌లోనూ కచ్చితంగా మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని భరోసా వ్యక్తం చేశారు. " ఆ నమ్మకం నాకుంది. కాంగ్రెస్‌ కుల, వారసత్వ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారు’ అని అమిత్‌షా విశ్వాసం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో విజయం సాధించి.. బిమారీ రాష్ట్రంగా ఉన్న రాజస్థాన్‌ను అభివృద్ధివైపు నడిపించామని అంటూ ఇప్పుడు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమిత్‌షా హామీ ఇచ్చారు. నోట్ల రద్దు తర్వాత పన్ను చెల్లింపుదారుల గణనీయంగా పెరిగాయని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో చోటుచేసుకున్న అల్లర్ల గురించి కూడా షా ప్రస్తావించారు. ఘటనను రాజకీయం చేయొద్దని, సిట్‌ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయని తెలిపారు.