రాజస్థాన్ లో అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీ

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రకటన జరగగానే ప్రభుత్వం మార్పు తప్పనిసరి అని రాజకీయ పండితులు అందరు ఏకగ్రీవంగా చెప్పినది రాజస్థాన్ గురించే. అక్కడ వసుంధర రాజే నాయకత్వంలోనే బిజెపి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని దాదాపుగా అన్ని పోల్ సర్వేలు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన్నట్లే అని భావిస్తున్న కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు కూడా ప్రారంభం అయ్యాయి.

అయితే మరో రెండు రోజులలో పోలింగ్ జరుగుతున్న ప్రస్తుత సమయంలో అనూహ్యంగా బిజెపి అక్కడ పుంజుకొవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. రాజస్థాన్‌లో తొలుత బిజెపి శ్రేణుల్లో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవం అని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా అంగీకరించారు. అయితే, ఉప ఎన్నికల్లో పరాజయం తర్వాత లోటుపాట్లను పార్టీ గుర్తించిందని, తాను అక్టోబరులో తొమ్మిది రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొని శ్రేణుల సమస్యలన్నింటినీ పరిష్కరించానని పేర్కొన్నారు. క్రమంగా పార్టీ పరిస్థితి మెరుగైందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ముఖ్యమంత్రి వసుంధర రాజెకు, తనకు మధ్య విభేదాలున్నాయన్న వార్తలు అవాస్తవమని కొట్టి పారవేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో రాజస్థాన్‌లో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెబుతరు వీటిపై సరైన పద్ధతిలో ప్రచారం చేయడం ద్వారా తిరిగి ప్రజాభిమానం సాధించగలిగామని భరోసా వ్యక్తం చేస్తున్నారు.

సునాయసంగా అధికారంలోకి వస్తోందనుకున్న కాంగ్రెస్ తమ బలం జారిపోకుండా చూసుకునేందుకు కష్టపడవలసి వస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న ప్రచారం పార్టీకి బాగా కలిసి వస్తుంటే తిరుగుబాటు అభ్యర్థుల మూలంగా కాంగ్రెస్ బలం తగ్గుముఖం పడుతోందనే మాట విపినిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న దూరం రోజురోజుకు తగ్గుతోందని సర్వేలు సూచిస్తున్నాయి.

టికెట్ల కేటాయింపు తరువాత బీజేపీ పరిస్థితి కొంత మెరుగుపడితే కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాటు అభ్యర్థుల తలనొప్పి బాగా పెరిగింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లో తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య రెండింతలు. ఈ సమస్యను పరిష్కరించటం కాంగ్రెస్ నాయకులకు తలకు మించిన భారంగా మారింది.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, యువ నాయకుడు సచిన్ పైలట్ ల మధ్య అంతర్గతంగా పొసగటం లేదు. అభ్యర్థుల ఎంపికలో పైలట్ తన కులం వారికే, తన నమ్మకస్తులకో సీట్లు ఇవ్వదలని పలుచోట్ల పట్టు బట్టడం చివరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సహితం చికాకు కలిగించింది. దానితో జాబితాను గిరాటు వేసి కోపంగా వెళ్లిపోయారు. ఒక సందర్భంగాలో తాను చెప్పిన వారికి కొన్ని సీట్లు ఇవ్వని పక్షంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను అంటూ బెదిరించినట్లు తెలుస్తున్నది. 

వీరిద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతూ ఉండగా జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతూ వస్తున్న మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయడం కాంగ్రెస్ లో మరో కలకలం రేపుతున్నది. గెహ్లోట్, పైలట్ ల మధ్య రాజీ కుదరకపోతే గిరిజా వ్యాస్ ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోవచ్చనే ప్రచారం సాగుతున్నది. ముఖ్యమంత్రి పదవికోసం కుమ్ములాటలు కాంగ్రెస్ విజయావకాశాలను వమ్ము చేస్తున్నాయని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. బిజెపిలో ఎటుంవటి సమస్య లేకపోవడంతో పార్టీ నేతలందరూ గెలుపు కోసం ద్రుష్టి సారిస్తున్నారు. 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందన్న సర్వే కథనాలను  వసుంధరాజే కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కొట్టిపారేశారు. అభివృద్ధి కార్యక్రమాలే బీజేపీని గెలిపిస్తాయని, వంద సీట్లు పక్కాగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తోందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పుడే కాదు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ అఖండ సాధిస్తుందని సింగ్ స్పష్టం చేశారు. అప్పుడు మీడియా, సర్వే సంస్థల నోళ్లు మూతపడతాయని ఆయన భరోసా వ్యక్తం చేసారు.

‘అభివృద్ధి ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు. మొత్తం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించింది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా సమర్ధవంతమైన నాయకత్వానికి అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.

దేశంలోకొత్త రాజకీయ సమీకరణలు సంతరించుకుంటున్నాయని చెబుతూ ఈశాన్యం, ఉత్తర, దక్షిణ, పశ్చిమ భారతం అంతా బీజేపీ ఆధీనంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షా ఆశీస్సులతో రాజే కష్టపడి పనిచేశారని ఆయన తెలిపారు.