సీఎం కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లరా?.. శివరాజ్ విస్మయం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే పరిపాలిస్తారని తెలుసుకుని ఆశ్చర్యపోయానని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మూడు పర్యాయాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఈ సమాచారం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. ఆవిర్భావంతోనే తెలంగాణ మిగులు రాష్ట్రమని, ఇప్పుడు అది లోటు రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపితోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని స్పష్టం చేశారు.

బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన సనత్‌నగర్‌ బిజెపి  అభ్యర్థి భవర్‌లాల్‌వర్మకు మద్దతుగా అమీర్‌పేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం కేవలం ఓ ఇంటికే పరిమితమైందని ధ్వజమెత్తారు. తండ్రి ముఖ్యమంత్రిగా, కుమారుడు, మేనల్లుడు మంత్రులుగా, కుమార్తె ఎంపీగా, మరో అల్లుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని విస్మయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం గుప్పెట్లోనే ఉందన్న చౌహాన్ ‘ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెత్తనం చేసిన మరో కుటుంబాన్ని నేను చూడలేదు’అని విరుచుకుపడ్డారలు. కాంగ్రెస్‌కన్నా ఎక్కువగా కేసీఆర్ కుటుంబం పాలన జరిగిందని చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్పే సీఎంను తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.రాజులు పోయాక, నిజాం పాలన అస్తమించాక తెలంగాణలో కొత్త రాచరిక వ్యవస్థ వేళ్లూనుకుందనేందుకు ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు.

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఇక్కడ విఫలమైందని, కనీసం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని అమలు చేసి ఉన్నా పేదలకు చిన్న ఇల్లయినా దక్కేదని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇదే పథకం కింద రెండేళ్లలో రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించినట్టు చెప్పారు. సుదీర్ఘ పోరాటంతో సిద్ధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తారని అనుకున్నానని, చివరికి అప్పులపాలు చేశారని ఎద్దేవా చేశారు. ఇక నియామకాల విషయానికి వస్తే, లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది? కేవలం 16,000 ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని, ప్రైవేటు ఉద్యోగాల కల్పన జరగలేదని విమర్శించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాడినట్టు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ఆ మూడింటినీ సాధించిందా? అని ప్రశ్నించారు. డిజైన్లలో మార్పులు పేరుతో అంచనాలను రెట్టింపు చేసి కాంట్రాక్టులు ఇచ్చారని, కానీ సాగు భూమి మాత్రం పెరగలేదని ఆరోపించారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, లక్ష్యాలు కూడా నెరవేరలేదని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు లోటు బడ్జెట్‌లోకి ఎలా వెళ్లిందో అందరికీ తెలుసని శివరాజ్‌సింగ్ చెప్పారు. నియామకాలు నీళ్లు ఏమయ్యాయో ఇంత వరకూ సీఎం చెప్పలేకపోతున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్, కేసీఆర్‌ విధానాల వల్ల బంగారంలాంటి అనేక అవకాశాలను తెలంగాణ కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. బీజేపీ పాలనలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల స్వరూపం మారిపోయిందని చౌహాన్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ టీడీపీలది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన కూటమి అని పేర్కొంటూ ఆవిర్భావానికి ముందే అది విఫలమైందని ఎద్దేవా చేశారు.