వర్షాల తగ్గినా వరదల ఉధృతి తగ్గని కేరళ

భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ జీవనం నెలకొంటోంది. వర్షాలు తగ్గినా వరద తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. వరద నీరు తగ్గిన చోట ప్రజలు సహాయక శిబిరాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇళ్ల నిండా మట్టి, బురద పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో పాటు, సర్వం కోల్పోవడంతో బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. దానితో ఇప్పుడు అందరి ద్రుష్టి సహాయ, పునరావాస కార్యక్రమాలపై పడింది.

తాము కోలుకునేందుకు చాలాకాలం పడుతుందని, పాడైపోయిన వాటిని మరమ్మతులు చేయించుకునేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని ఆవేదన చెందుతున్నారు.

కాగా రాజధాని తిరువనంతపురం, ఎర్నాకులం ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలను మళ్లీ నెమ్మదిగా ప్రారంభిస్తున్నారు. మరోవైపు కోచిలోని నేవల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్యపరమైన విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఎయిరిండియా విమానం ఉదయం అక్కడకు వచ్చింది. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈనెల 26 వరకు మూసి ఉంచడంతో ఇప్పటికే చిన్న విమానాలను నేవల్ ఎయిర్‌పోర్టు నుంచి నడిపిస్తున్నారు.

వర్షాలు వల్ల కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లింది. విమానాల రాకపోకల రద్దు వల్ల సుమారు రూ.500 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. టర్మినల్ బిల్డింగ్‌ను శుభ్రం చేసేందుకు సుమారు 200 మంది పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం సమీపంలో ఉన్న ఓ నౌకాదళ ఎయిర్ స్టేషన్ నుంచి పౌర విమానాలను నడపనున్నారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్నాకుళం జిల్లాలో గత 4 రోజులగా సుమారు 50 వేల మందిని రక్షించారు.

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తాజాగా వాయవ్య బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. అయితే, దాని ప్రభావం కేరళ మీద అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రాబోయే ఐదు రోజుల్లో క్రమంగా అక్కడ వర్షాలు తగ్గుతాయని అంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయినవారిలో చాలామందిని కాపాడామని, వారికి పునరావాసం కల్పించడం ఇపుడు తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 8వ తేదీనుంచి ఇప్పటికి 370 మంది ప్రాణాలు కోల్పోయారు. 7.24 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అళప్పుళ జిల్లాలోని చెంగన్నూరు బాగా తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,645 పునరావాస శిబిరాలలో 7,24,649 మంది తలదాచుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే 22వేల మందిని వరద చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి కాపాడారు. 

వరద క్రమంగా తగ్గుతుండటంతో ఇప్పుడు కేరళలో వ్యాధుల భయం పొంచి ఉంది. నీరు తగ్గిన తర్వాత అంటువ్యాధులు వ్యాపించకుండా చూసేందుకు ఒక్కో పంచాయతీలో ఆరుగురు ఆరోగ్య అధికారులను మోహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వరదనీరు తగ్గిన ప్రాంతాలలో ప్రజలు నెమ్మదిగా తమ ఇళ్లకు తిరిగి చేరుకుంటున్నారు. ఇళ్ల నిండా మట్టి, బురద పేరుకుపోయి ఉండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. 

కేరళలో వర్షాలు వల్ల కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లింది. విమానాల రాకపోకల రద్దు వల్ల సుమారు రూ.500 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. టర్మినల్ బిల్డింగ్‌ను శుభ్రం చేసేందుకు సుమారు 200 మంది పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆగస్టు 26 వరకు కొచ్చి విమానాశ్రయం నుంచి ఎటువంటి విమానాల రాకపోకలు ఉండవని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అయితే సమీపంలో ఉన్న ఓ నౌకాదళ ఎయిర్ స్టేషన్ నుంచి పౌర విమానాలను నడపనున్నారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్నాకుళం జిల్లాలో గత 4 రోజులగా సుమారు 50 వేల మందిని రక్షించారు.