వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ప్రధాని మోదీ టాప్

దేశంలో 2018 ఏడాదిలో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారని ప్రముఖ సెర్చింజన్‌ యాహూ తెలిపింది. `యాహు ఇయర్‌ ఇన్‌ రివ్యూ’ పేరిట యాహూ సంస్థ ప్రతీ ఏడాది ఎక్కువగా వార్తల్లోకెక్కిన ప్రముఖులతో ఓ జాబితా రూపొందిస్తుంది. 2018 ఏడాదికి చెందిన జాబితా తాజాగా విడుదలైంది.

ఈ జాబితాలో మోదీ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌  ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు మూడో స్థానం దక్కింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారస్తులు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలు వరుసగా 4వ, 5వ స్థానాల్లో నిలిచారు.

కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌లు ‘జంట’ కేటగిరీలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మోదీ ఒవైసీ కాళ్లు మొక్కాడనీ, నెలకు రూ. 15 లక్షలు ఖర్చు పెట్టి మోదీ వ్యక్తిగతంగా మేకప్‌ ఆర్టిస్ట్‌ను నియమించుకున్నారనీ, ఓ వేదికపై రాహుల్‌ గాంధీ మహిళ చేయి పట్టుకున్నారనీ తదితర నకిలీ వార్తలు ఎక్కువగా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయని యాహూ వెల్లడించింది.

వివిధ కేటగిరీల వారీగా వార్తల్లో నిలిచిన ప్రముఖులను చూస్తే ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, పారిశ్రామిక రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, పురుష సెలబ్రిటీల్లో సల్మాన్‌ ఖాన్, మహిళా సెలబ్రిటీల్లో సన్నీ లియోనీలు ప్రథమ స్థానాల్లో నిలిచారు.  కన్ను కొట్టే పాటతో ప్రాచుర్యం పొందిన ప్రియా వారియర్‌ తదితరులు జాబితాలో ఉన్నారు.