ఏపీ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కేంద్రానిదే

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కేంద్రానిదే అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, విమానయానశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. బీజేపీ విజయవాడ పార్లమెంటరీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి ప్రారంభిస్తూ ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం కరపత్రం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ రాసిన 100 ప్రశ్నల పుస్తకాన్ని సురేష్ ప్రభు ఆవిష్కరించారు. అమరావతి రాజధాని నిర్మాణం బిజెపితోనే సాధ్యమని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ 2014 నుంచి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం గణనీయమైన అభివృద్ధి చెందిందని చెప్పారు. వౌలిక సదుపాయాలు, సంక్షేమంతో అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం నిధులు విడుదల జరుగుతునే ఉంటుందని భరోసా ఇచ్చారు.

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ఆర్థిక సహాయం, కేటాయించిన పథకాలు, ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియజేసేందుకు ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం డిసెంబర్ 1 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 1న పలాసలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని  చెబుతూ ఏపీకి ప్రాజెక్టుల కింద రూ. 25వేల కోట్లు విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇటీవలే కేంద్ర విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా పాల్పడుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలను క్షేత్రస్థాయిలోని ప్రజలకు తెలియజెప్పేందుకే ఇంటింటికీ పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో కన్నా లక్ష్మీనారాయణ, పలువురు పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి బీజేపీ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ రాష్ట్రప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 90 శాతం నిధులు కేంద్రప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి ఎన్ని వేల కోట్లయినా మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.