ఇక ఎన్నికలకు ఉమా భారతి దూరం

2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత ఉమా భారతి ప్రకటించారు. రాజకీయాల నుంచి ఆమె రిటైర్ కానున్నారు. ఈ మేరకు ఉమా భారతి పార్టీ అధిష్టానాన్ని అనుమతి కోరారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోనున్న ఆమె ఆ తర్వాత రామ మందిరం నిర్మాణంతో పాటు, పవిత్ర గంగానది ప్రక్షాళనపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. 

కాగా కొద్ది రోజుల క్రితం విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ నుంచి గంగా యాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సుమారు ఏడాదిన్నర కొనసాగనుంది. యాత్ర చేపట్టేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉమాభారతి అనుమతి కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఎలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, అన్నీ పార్టీల సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా, బులంద్‌షహర్ హింసాత్మక ఘటన దురదృష్టకరమని ఉమాభారతి  అన్నారు.  ఈ విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రద్ధ చూపించినట్లు అయితే బాగుండేదని చెప్పారు.