బీజేపీ అభ్యర్ధుల్లో జోష్ నింపిన మోదీ పర్యటన

మరో మూడు రోజులలో పోలింగ్ జరగనుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జరిపిన పర్యటన తెలంగాణలో బిజెపి అభ్యర్థులలో జోష్ నింపింది. గత వారం నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ సోమవారం  హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఎంఐఎంలపై ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై నేరుగా ఆరోపణలు చేశారు. ఒక విధంగా ఇప్పటి వరకు బిజెపి వర్గాలలో ఉన్న కొన్ని అనుమానాలను పటాపంచలు చేశారు.

అనంతరం ఆయన 45 నిమిషాల పాటు మాట్లాడుతూ ఎక్కువ సమయం స్థానిక పరిస్థితులు, అమరవీరుల త్యాగాలు, తెలంగాణ పరిస్థితులు, భవిష్యత్‌లో తెలంగాణ అభివృద్ధికి తమ లక్ష్యాలను వివరించారు. నాలుగేళ్లు చాలా నష్టపోయారు, ఇంకా నష్టపోవద్దు అంటూ ప్రధాని ఓటర్లకు హితవు పలికారు. తొలుత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం తెలుగులో ప్రారంభమైంది. హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతే తనకు ఆదర్శమని చెప్పారు. పటేల్ పట్టుదల వల్లనే హైదరాబాద్‌కు విమోచనం లభించిందని, అందుకే హైదరాబాద్ అనగానే తనకు పటేల్ గుర్తుకువస్తారని పేర్కొన్నారు. అసలు పటేల్ లేకపోయినట్టయితే ఇంత స్వేచ్చగా ఆనందంగా మీతో మాట్లాడే అవకాశం లభించేది కాదని ప్రధాని స్పష్టం చేశారు.

పదే పదే అమరవీరుల త్యాగాల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని ప్రశ్నల వర్షం కురిపించారు. యూపీఎ ప్రభుత్వంలో కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదా? తెలంగాణ రాగానే కేసీఆర్ ఢిల్లీలో సోనియాకు మొక్కలేదా అని ప్రశ్నిస్తూ ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్నా ఎన్నికల అనంతరం వారిద్దరూ కలిసిపోయే అవకాశం లేకపోలేదనే సంకేతం ఇస్తూ ప్రజలను హెచ్చరించారు.

తెలగంణ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు ఇపుడు జరుగుతున్నాయని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఓ కుటుంబం చేతిలోకి పోయిందని, ఒక కుటుంబం తెలంగాణను లూటీ చేస్తోందని కేసీఆర్‌పై పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. ఒక వంక టీఆర్‌ఎస్ , మరో వంక ఎంఐఎం నేతలు కేంద్రంలో తిరిగి మోదీని ప్రధానిగా చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారని అంటూ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు తదితరులు చేస్తున్న ఆరోపణలను పటాపంచలు చేయగలిగారు. 

ఇపుడు బీజేపీని టీఆర్‌ఎస్‌కు టీమ్ - బీ అంటున్నారని, ఎన్నికలు ముగిశాక టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలవడం ఖాయమని స్పష్టం చేశారు. డిసెంబర్ 7 తర్వాత వారసత్వ కుటుంబ పార్టీలు కనుమరుగైపోతాయని చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపూ సభా ప్రాంగణం నినాదాలు, చప్పట్లతో మారు మ్రోగిపోయింది. ఆ జోష్‌ను చూసిన ప్రధాని ఇపుడే విజయం ఖాయమైనట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.