సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతిభవన్‌

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసలు సచివలయానికే రారు. అధికార నివాసం `ప్రగతి భవన్’ నుండి అన్ని కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. అయితే అక్కడకు వెళ్ళాలి అంటే సాధారణ ప్రజలు ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. చివరకు అధికార హోదాలలో ఉన్నవారు సహితం అనుమతి ఉంటేనే ప్రవేశం ఉంటుంది. దానితో ముఖ్యమంత్రికి ఏ సమస్య విన్నవించు కోవాలి అన్నా ఎవ్వరికీ దాదాపు సాధ్యం కావడం లేదు. చివరకు ఉన్నత అధికారులు సహితం అత్యవసరమైన పరిపాలన సంబంధ అంశాలను చర్చించాలి అనుకొన్నా కెసిఆర్ దర్శనం దొరకడం దుర్లభంగా ఉంది.

ఎవరైనా కెసిఆర్ పిలిస్తే వెళ్ళవలసిందే గాని, ఆయనను కలవడం ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదంటూ ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి దేశంలో మరెవ్వరు కనిపించరు. చివరకు మంత్రులకు సహితం కెసిఆర్ ను కలవడం అంత సులభం కాదు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరున్నా  మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగా అనుమతి లేకుండా కలవడానికి కొంత సమయం కేటాయించే వారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేనే లేదు.

ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో పూర్తి హంగూ ఆర్భాటాలతో నిర్మించామని చెప్పిన ప్రగతిభవన్ ప్రజలకు నిరుపయోగంగా మారింది. సుమారు పది వేల మంది ప్రజలు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించే విధంగా ప్రగతిభవన్‌ను నిర్మిస్తున్నామని గతంలో  ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం 25 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి సచివాలయాన్ని సందర్శించారు. చివరిగా 2016 ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి,  ప్రగతిభవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని అధికారిక కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్ నిర్మాణం కాకముందు ముఖ్యమంత్రి సచివాలయానికి రాకుండా అధికార నివాసం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు.

ముఖ్యమంత్రి రాకపోవడంతో రాష్ట్ర మంత్రుల్లో కనీసం నలుగురైదుగురు మినహా  మిగతావారంతా సచివాలయానికి రావడం అంతంతమాత్రమైంది. దీంతో సమస్యలు పరిష్కారం కోసం వచ్చే సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఉన్నతాధికారులు సహితం అంత ఆసక్తి చూపడం లేదు.